తమకు కేటాయించిన అసైన్డ్ భూములను పరిరక్షించుకునేందుకు నిరవధిక నిరసన దీక్ష చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాధవరం గ్రామపంచాయతీ ఎస్‌కేఆర్ నగర్ హరిజనవాడకు చెందిన దళిత పేద రైతులు శనివారం సిద్ధవటం తహసీల్దార్, ఒంటిమిట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
2013 భూ అసైన్మెంట్ కమిటీ 7వ ఫేజ్‌లో తమను భూహక్కుదారులుగా ఎంపిక చేసినప్పటికీ పట్టా పాస్‌బుక్కులు ఇవ్వడంలో జాప్యం జరిగిందని తెలిపారు. పెద్దపల్లి సర్వే నంబర్ 937లోని 1147 నుంచి 1162 వరకు ఉన్న భూముల్లో 70 కుటుంబాలు హక్కుదారులుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల కొందరు గ్రీన్ హైవే పనుల పేరుతో తమ భూముల్లో మట్టి తరలించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
తమ భూముల్లో మూడో వ్యక్తులు ప్రవేశించకుండా హైకోర్టు నుంచి స్టేటస్‌కో ఉత్తర్వులు పొందినట్లు తెలిపారు. తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, మద్దతు తెలిపిన వారిపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. గ్రీన్ హైవే పనులను తాము అడ్డుకోవడం లేదని స్పష్టం చేస్తూ, అహింసా పద్ధతిలో నిరసన చేపట్టేందుకు అనుమతితో పాటు తగిన స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు.


