కొమురంభీం ఆసిఫాబాద్ పున్నమి రిపోర్టర్ | తేదీ: 17-08-2026
తిర్యాణి: పని ఒత్తిడితో సతమతమయ్యే ప్రజలు ఆదివారాలు, సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులు, పిల్లలతో విహారయాత్రలకు వెళ్లి కాస్త సేదతీరాలని భావిస్తారు. అయితే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదారం వాటర్‌ఫాల్స్ వద్ద వసూలు చేస్తున్న ఎంట్రీ, వాహన ఫీజులు పర్యాటకులకు భారంగా మారుతున్నాయని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చే సాధారణ, పేద, మధ్యతరగతి కుటుంబాలపై అధిక ఫీజుల భారం పడుతోందని, కుటుంబ సభ్యులతో కలిసి వస్తే ఖర్చులు మరింత పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. విహారయాత్రకు వచ్చి రిలాక్స్ కావాల్సిన పరిస్థితిలో అధిక ఫీజుల కారణంగా ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నామని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు.
సదుపాయాలు కరువు
చింతల మాదారం వాటర్‌ఫాల్స్ వద్ద పర్యాటకుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు, మూత్ర విసర్జన సదుపాయాలు, ఇతర అవసరాలకు అనువైన సౌకర్యాలు అందుబాటులో లేవని వారు చెబుతున్నారు.
కుటుంబాలతో, చిన్నారులతో వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం సరికాదని సందర్శకులు అంటున్నారు. పర్యాటకుల భద్రత, పరిశుభ్రతతో పాటు మహిళలు, చిన్నారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రజల డిమాండ్
చింతల మాదారం వాటర్‌ఫాల్స్ వద్ద వసూలు చేస్తున్న ఎంట్రీ, వాహన ఫీజులను తగ్గించాలని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఫీజులను నిర్ణయించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, పరిశుభ్రత, విశ్రాంతి ప్రాంతాలు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
“విహారానికి వచ్చే ప్రజలపై ఆర్థిక భారం కాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి” అని పర్యాటకులు అధికారులను కోరుతున్నారు.



