Wednesday, 16 September 2026

Tag: Asifabad

ASIFABAD

RBSK వైద్య శిబిరంలో విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్లు

మరో 15 రోజుల్లో మరోసారి వైద్య శిబిరం ఆసిఫాబాద్, పున్నమి ప్రతినిధి, తేది11.09.2026: తెలంగాణ వైద్య విధాన పరిషత్, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు RBSK వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా RBSK వైద్యులు డాక్టర్ నరేందర్ మరియు వైద్య బృందం విద్యార్థులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టుల ఆధారంగా దృష్టి సమస్యలు ఉన్న 20 మంది విద్యార్థులకు ఉచితంగా తగిన కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ, మరో 15 రోజుల్లో తిరిగి RBSK వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ వైద్య శిబిరం ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, రాజన్న, గురుకుల నర్సింగ్ ఆఫీసర్ ముదిమడుగుల శ్యామ్ చందర్, అధ్యాపకులు కోసరి మహేష్, రాజకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

రెబ్బెనలో గంజాయి జోరు.. పేకాటపై పోలీసుల నిఘా ఏది?

బల్లార్షా నుంచి గంజాయి తరలిస్తుండగా ఇద్దరు యువకులు పట్టుబడటంతో కలకలం గ్రామాల్లో పేకాట, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ రెబ్బెన ఎస్సై పనితీరుపై ప్రజల ప్రశ్నలు.. ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని విజ్ఞప్తి రెబ్బెన, సెప్టెంబర్ 5 (పున్నమి రిపోర్టర్): రెబ్బెన మండలంలో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మత్తుపదార్థాల విక్రయాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి గంజాయిని తరలిస్తున్న సమయంలో మండలానికి చెందిన ఇద్దరు గ్రామ యువకులు పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బయటి ప్రాంతాల నుంచి గంజాయి తరలింపు జరుగుతున్న నేపథ్యంలో మండలంలోని గ్రామాలు, పల్లెల్లో గంజాయి విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? వాటిపై పోలీసుల నిఘా ఎంతవరకు ఉంది? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో మత్తుపదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, వాటి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేకాటను ప్రశ్నించిన యువకుడి విషయంలో వివాదం గతంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు వాట్సాప్ గ్రూప్ వేదికగా కొందరు వార్డు సభ్యులు పేకాట ఆడుతున్నారని ప్రస్తావించి, పేకాటను అరికట్టాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ వార్డు సభ్యుడు ఆ యువకుడిని ఫోన్‌లో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం గ్రామ సర్పంచ్, కొందరు వార్డు సభ్యులు, సర్పంచ్ భర్త, వార్డు సభ్యుల భర్తలు కలిసి ఆ యువకుడి పై రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అయితే ఘటనకు సంబంధించిన విషయాలను వక్రీకరించి ఫిర్యాదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఓ వార్డు సభ్యుడి కుమారుడు పేకాట ఆడుతున్న సమయంలో గ్రామ యువకుడి భార్య ఫొటో తీసి అదే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసినట్లు, అనంతరం ఆ మహిళను కించపరిచే విధంగా మరో పోస్టు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇరువైపుల నుంచి ఆరోపణలు ఉన్నప్పటికీ, తమపై మాత్రమే పోలీసులు చర్యలకు ప్రయత్నించారని, మరోవైపు తమను దూషించిన వార్డు సభ్యుడిపై, మహిళను కించపరిచేలా పోస్టు చేసిన యువకుడిపై తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అలాగే రెబ్బెన ఎస్సై తమను దూషించి, చివరకు కేసును రాజీ చేసుకునే విధంగా వ్యవహరించారని వారు పేర్కొంటున్నారు. “ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు?” ఈ పరిణామాల నేపథ్యంలో రెబ్బెన ఎస్సై ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు గ్రామాల్లో పేకాట వంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తుండగా, మరోవైపు వాటిని ప్రశ్నించే యువతపై కేసులు, ఒత్తిళ్లు వస్తే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డు సభ్యుల స్థాయిలోనే పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉంటే, సామాన్య ప్రజలు, యువత పరిస్థితి ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేకాట నుంచి మత్తుపదార్థాల వైపు యువత వెళ్లే ప్రమాదం గ్రామాల్లో పేకాట, ఇతర అక్రమ కార్యకలాపాలు పెరిగితే వాటి ప్రభావం యువతపై పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత మత్తుపదార్థాల వైపు మళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, పేకాట, సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను కించపరిచే పోస్టులు వంటి ఏ చిన్న అక్రమ కార్యకలాపం జరిగినా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సై పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టి అవసరం ఫిర్యాదు వచ్చిన ప్రతిసారీ ఒకవైపు వ్యక్తుల మాటలు మాత్రమే కాకుండా ఇరువర్గాల వాదనలు, ఆధారాలు, వాట్సాప్ పోస్టులు, ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆధారాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రెబ్బెన పోలీస్ అధికారులు పక్షపాతానికి తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు సూచిస్తున్నారు. అలాగే మండలంలో గంజాయి, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. “చట్టం అందరికీ సమానమే.. తప్పు చేసిన వారిపై చర్యలు ఉండాలి.. ప్రశ్నించిన వారిపై ఒత్తిళ్లు ఉండకూడదు” అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

ASIFABAD

నవోదయలో 9, 11వ తరగతులకు ప్రవేశాలు.. 

దరఖాస్తులకు సెప్టెంబర్ 30 చివరి గడువు! అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి సూచన ఆసిఫాబాద్, సెప్టెంబర్ 03 (పున్నమి రిపోర్టర్): 2027–28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉండబోయే సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి, PM SHRI JNV మార్గదర్శకాల మేరకు ఈ ప్రవేశ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశానికి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. ప్రవేశం పొందేందుకు అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత ఎంపిక/ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు నిర్దేశిత ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026 అని అధికారులు తెలిపారు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు లింకులు 9వ తరగతి ప్రవేశం: https://cbseitms.nic.in/2026/nvsix_9 11వ తరగతి ప్రవేశం: https://cbseitms.nic.in/2026/nvsxi_11 అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు. – జిల్లా విద్యాశాఖ అధికారి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

ASIFABAD

బాల్య వివాహాలకు చెక్ పెట్టండి… బాలికల భవిష్యత్తును కాపాడండి!

 బాల్య వివాహాలకు చెక్ పెట్టండి… బాలికల భవిష్యత్తును కాపాడండి! బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ అంకితభావంతో పనిచేయాలి సంబంధిత శాఖలు–స్వచ్ఛంద సంస్థల సమన్వయం అత్యవసరం: జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి కొమురంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 31 (పున్నమి రిపోర్టర్): బాల్య వివాహాలు బాలికల జీవితాలను చీకట్లోకి నెడుతున్నాయని, వాటి నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా అంకితభావంతో పనిచేయాలని జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ) మహేష్‌తో కలిసి ఆవిష్కరించారు.  బాల్య వివాహం… బాలికల భవిష్యత్తుపై పెను ప్రభావం! ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల హక్కులను హరిస్తాయని, ముఖ్యంగా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టడం ఒక్క శాఖ బాధ్యత కాదని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు శాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా ముందుకు రావాలని కోరారు.  గ్రామం నుంచి జిల్లాకు… విస్తృత అవగాహన కార్యక్రమాలు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బాల్య వివాహాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామసభలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు.  బాల్య వివాహం చట్టవిరుద్ధం… సహకరించినా చర్యలే! 18 సంవత్సరాలు నిండని బాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే, నిర్వహించే లేదా వాటికి సహకరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.  ముందస్తు గుర్తింపే కీలకం: డీసీపీఓ మహేష్ జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణలో ముందస్తు గుర్తింపు, సమాజ భాగస్వామ్యం, నిరంతర అవగాహన కార్యక్రమాలు అత్యంత కీలకమని అన్నారు. బాల్య వివాహాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి, ప్రమాదంలో ఉన్న బాలికలకు అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్, విద్య, పునరావాస సహాయాన్ని సంబంధిత శాఖల సమన్వయంతో అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివాహాలు కాదు… బాలికలకు విద్యే అసలైన భవిష్యత్తు! ప్రతి బాలికకు విద్య, భద్రత, ఆరోగ్యం, గౌరవంగా జీవించే హక్కు ఉందని తెలిపారు. బాల్య వివాహాల స్థానంలో బాలికల విద్య, సాధికారతకు కుటుంబాలు, సమాజం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ మహేష్, డీసీపీయూ కౌన్సిలర్ చంద్రశేఖర్, ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బండి సంతోష్ కుమార్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అవగాహన ద్వారానే సైబర్ మోసాలను అరికట్టవచ్చు సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ కొమరం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 31 (పున్నమి రిపోర్టర్): సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, వ్యక్తిగత మరియు బ్యాంకు సంబంధిత సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సైబర్ క్రైమ్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ కొండగుర్ల కమలాకర్ అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా అధ్యక్షులు వంగారి ప్రవీణ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని సూచించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, వాట్సాప్ లింకులు, ఏపీకే (APK) ఫైళ్లు, రివార్డ్ లేదా బహుమతి పేరుతో వచ్చే లింకులకు స్పందించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లు, అక్రమ ఆన్‌లైన్ పథకాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని పేర్కొన్నారు. పోలీసు శాఖ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో భయపెట్టి డబ్బులు పంపాలని ఎవరైనా కోరితే వెంటనే నమ్మవద్దని, సంబంధిత అధికారులను సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాలని తెలిపారు. ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం ద్వారానే సైబర్ మోసాలను గణనీయంగా అరికట్టవచ్చని అన్నారు. సైబర్ మోసానికి గురైనట్లు లేదా ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసరంగా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. పోలీసు శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ జిల్లా కోశాధికారి గజ్జల తిరుపతి, కాగజ్‌నగర్ డివిజన్ అధ్యక్షులు మదాసు నాగేష్, కాగజ్‌నగర్ మండల అధ్యక్షులు కడరి శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి సంతోష్, మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

ఆర్టీఐతో బట్టబయలైన పట్టా వ్యవహారం? 

రెబ్బెన రెవెన్యూ కార్యాలయంపై ప్రశ్నల వెల్లువ. ప్రభుత్వ భూమిని కాజేశారా? జూనియర్ అసిస్టెంట్‌పై చర్యలు ఎందుకు లేవని ప్రజల ప్రశ్న రెబ్బెన, ఆగస్టు 29 (పున్నమి రిపోర్టర్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 153/18, విస్తీర్ణం 3.00 ఎకరాల లావుని పట్టా భూమి వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెబ్బెన ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ అక్రమంగా పట్టా పొందారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, సంబంధిత సర్వే నెంబర్‌కు 1952 నుంచి 2016 వరకు పహాణీ రికార్డులు లేవని, ఫారమ్-7 అందుబాటులో లేదని, అలాగే అసైన్మెంట్ రిజిస్టర్‌లో కూడా నమోదు లేదని సమాచారం వెల్లడైనట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డుల్లో నమోదు లేకపోతే పట్టా ఎలా? సదరు సర్వే నెంబర్‌కు కీలక రెవెన్యూ రికార్డులు లేనప్పుడు, ఆ భూమి పట్టా ఎలా మంజూరైంది? ఏ ఆధారాలపై హక్కులు కల్పించారు? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. అలాగే జూనియర్ప్ర అసిస్టెంట్ ప్రస్తుతం సదరు భూమి కబ్జాలో లేరని ఆరోపణలు ఉన్నప్పటికీ, రైతు భరోసా పథకం ప్రయోజనాలు పొందుతున్నారనే అంశంపై కూడా సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. డీడీ రూపంలో డబ్బులు చెల్లించినా పూర్తి సమాచారం ఇవ్వలేదా? ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోసం నిర్ణీత రుసుమును డీడీ రూపంలో చెల్లించినప్పటికీ పూర్తి సమాచారం అందించకుండా రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్‌కు సంబంధించిన ఈ వ్యవహారంలో కీలక సమాచారం కోరినప్పటికీ అధికారులు పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్‌పై రెవెన్యూ అధికారులకు ఎందుకింత ప్రేమ? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అధికారి ప్రభుత్వ భూమిని కాజేస్తే ఎలా? ఒకవేళ ప్రభుత్వ రికార్డుల్లో భూమికి సంబంధించిన సరైన నమోదు లేకపోయినా, లేదా ప్రభుత్వ భూమికి సంబంధించిన హక్కులు అక్రమంగా వ్యక్తిగత పేర్లకు మార్చబడినట్లు విచారణలో తేలితే, అది అత్యంత తీవ్రమైన అంశమని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణకు డిమాండ్ సర్వే నెంబర్ 153/18కు సంబంధించిన పహాణీలు, ఫారమ్-7, అసైన్మెంట్ రిజిస్టర్, పట్టా మంజూరు ఫైలు, మ్యూటేషన్ వివరాలు, రైతు భరోసా ప్రయోజనాల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమి ఉంటే తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

ASIFABAD

విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లో కొత్త బాధ్యతలు

జిల్లా కన్వీనర్‌గా రాథోడ్ రమేష్, కో-కన్వీనర్‌గా పాత్లె రాజు నియామకం కొమురం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 29: యువత సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కమిటీ బాధ్యతలను ప్రకటించింది. కేరమెరి మండలం బోరిలాల్‌గూడ గ్రామానికి చెందిన రాథోడ్ రమేష్‌ను జిల్లా కన్వీనర్‌గా, కేరమెరి మండల కేంద్రానికి చెందిన పాత్లె రాజును జిల్లా కో-కన్వీనర్‌గా నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ బద్దం పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి. మురళి మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన జిల్లా కన్వీనర్ రాథోడ్ రమేష్, కో-కన్వీనర్ పాత్లె రాజు మాట్లాడుతూ, విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యువత సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థగా, వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంస్థ జాతీయ స్థాయి సమావేశాలకు హాజరై, అక్కడ రూపొందించే కార్యాచరణకు అనుగుణంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రకటిస్తామని వెల్లడించారు. తమపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ విశ్వనాథ్, సి. గణేష్ (రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఉస్మానియా యూనివర్సిటీ), జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి. మురళి మనోహర్లకు రాథోడ్ రమేష్, పాత్లె రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. – పున్నమి రిపోర్టర్

ASIFABAD

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా

ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు, కోచ్‌లకు ఘన సన్మానం ఉట్నూర్, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ ఉట్నూర్ ఆధ్వర్యంలో కె.బి. కాంప్లెక్స్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరంద్ జెండా ఊపి క్రీడా ర్యాలీని ప్రారంభించారు. ఉట్నూర్ ఐ.బి. చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ కె.బి. కాంప్లెక్స్ వరకు కొనసాగింది. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన క్రీడా పాఠశాల, ఆసిఫాబాద్ విద్యార్థినులను ఘనంగా సన్మానించారు. అథ్లెటిక్స్ విభాగంలో ఎం. రాజేశ్వరి, ఎం. అఖిల, హ్యాండ్‌బాల్ విభాగంలో డి. నందిని, ఎ. మౌనిక, ఖో-ఖో విభాగంలో సిహెచ్. జంగుబాయి, కె. సత్యశీలలను సత్కరించారు. అదేవిధంగా గిరిజన క్రీడాకారులకు విశేష సేవలు అందిస్తూ, వారిని క్రీడల్లో తీర్చిదిద్దుతున్న అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్‌బాల్ కోచ్ ఎస్. అరవింద్, ఖో-ఖో కోచ్ వాసం తిరుమల్లను శాలువా, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమకళ, ఏపీఓలు భాస్కర్, వసంత్, డిప్యూటీ డీఈఓ (ఏజెన్సీ) చందన్, క్రీడల అధికారులు పార్థసారథి, షేకు నిర్వహించారు. క్రీడాకారిణులు, కోచ్‌లను డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ (కెబీ ఆసిఫాబాద్) జాదవ్ అంబాజీ, ఏసీఎంఓ ఉద్దవ్, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబారావు, వ్యాయామ ఉపాధ్యాయులు మీనా రెడ్డి, హెచ్‌డబ్ల్యూఓలు విజయలక్ష్మి, సరితతో పాటు పాఠశాల అధ్యాపక బృందం అభినందించింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి, ఉత్సాహం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. – పున్నమి రిపోర్టర్

ASIFABAD

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు 879 కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు చిన్నారులకు మెరుగైన వసతులే లక్ష్యం: ఎస్ఈ ఉత్తమ్ జాడే ఆసిఫాబాద్, ఆగస్టు 29: చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆసిఫాబాద్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. సర్కిల్ పరిధిలోని మొత్తం 879 అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు ఆయన వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందని ఎస్ఈ పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. దీంతో చిన్నారులు వేడి, ఉక్కపోత వంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యా, అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతున్నారని తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఉపయోగపడుతుందని చెప్పారు. చిన్నారులకు పోషకాహారం తయారీ, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం, విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడాన్ని ఎన్పీడీసీఎల్ సామాజిక బాధ్యతగా భావిస్తోందని ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. ప్రతి అంగన్వాడి కేంద్రం విద్యుత్ వెలుగులతో కళకళలాడేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. – పున్నమి రిపోర్టర్

ASIFABAD

మహిళా ప్రజాప్రతినిధుల వెనుక భర్తల పెత్తనం ఎందుకు?

-ప్రశ్నిస్తే కక్షలు, ఆరోపణలు.. రెబ్బనలో ప్రజాస్వామ్యానికి పరీక్ష! ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బన మండలం: మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల ఆ పదవుల వెనుక భర్తలు లేదా కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికైనది మహిళా ప్రజాప్రతినిధి అయితే, అధికారిక నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా ఆ ప్రజాప్రతినిధే. కానీ ఆమె పేరుతో మరొకరు పాలన సాగిస్తే, అది మహిళా సాధికారతను అవమానించడమే కాదా? రెబ్బన మండలంలో మహిళా సర్పంచ్ భర్తల జోక్యం, మహిళా వార్డు సభ్యుల భర్తల పెత్తనం గురించి స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిని సమాధానాలతో ఒప్పించాల్సింది పోయి, వ్యక్తిగత ఆరోపణలు చేయడం, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం వంటి ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ప్రశ్నిస్తే తప్పా? గ్రామంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? పంచాయతీ నిధులు ఎలా ఖర్చవుతున్నాయి? సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందుతున్నాయా? అనే ప్రశ్నలు అడగడం ప్రతి పౌరుడి హక్కు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన చోట వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, బెదిరింపుల వాతావరణం ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది. మహిళా సర్పంచ్ లేదా వార్డు సభ్యురాలిని ప్రజలు ఎన్నుకుంటే, ఆమె వెనుక భర్త కాదు—ఆమె స్వయంగా ప్రజల ముందు నిలబడి బాధ్యత వహించాలి. మహిళా సాధికారత పేరుతో పదవి మహిళకు ఇచ్చి, నిర్ణయాధికారం మాత్రం భర్త చేతిలో ఉండటం ఏ విధమైన సాధికారత? ఈ వ్యవహారంపై స్వేరోస్ జిల్లా నాయకులు గోలేటి నాగేష్ స్పందిస్తూ, ప్రజాప్రతినిధుల అధికారిక బాధ్యతల్లో కుటుంబ సభ్యుల అనధికార జోక్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలు అడిగే ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల వాదన కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిజమా కాదా అన్నది సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి వాస్తవాలను బయటపెట్టాలి. పదవి అంటే పెత్తనం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత. ప్రశ్నించే ప్రజలను అణచడం కాదు.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్య ధర్మం. రెబ్బన మండలంలో ప్రజాప్రతినిధుల పాలన పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సాగాలని ప్రజలు కోరుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పేరుతో వారి భర్తలు లేదా ఇతర కుటుంబ సభ్యులు అధికారాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలకు అధికారులు చెక్ పెట్టాలి. లేకపోతే మహిళా సాధికారత అనే గొప్ప లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ప్రజల గొంతును ప్రశ్నగా చూడకండి.. అది ప్రజాస్వామ్యానికి అద్దం. ప్రశ్నలకు సమాధానం చెప్పలేనీ పాలన జవాబుదారీతనం కోల్పోయిన స్థాయి అవుతుంది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.