ఇద్దరు మహిళలు మృతి
ఆత్మకూరు(పున్నమి ప్రతినిధి ) : ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపైకి వచ్చిన గేదెను తప్పించబోయిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మైదుకూరులో ఆర్కెస్ట్రా కార్యక్రమం ముగించుకొని నెల్లూరు వైపు వస్తున్న కారు, వాసిలి సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అదే సమయంలో రోడ్డుపైకి వచ్చిన గేదెను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డుకి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో భాగ్యమ్మ(44), కామాక్షమ్మ(56) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ప్రాంతంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

