ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా సవరణ ప్రక్రియ చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, వినతుల పరిశీలన ప్రక్రియను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామంలో జరుగుతున్న పరిశీలన ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, అధికారులు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఓటర్ల నుంచి అందిన ప్రతి అభ్యంతరం, వినతిని నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.
అర్హత ఉన్న ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అనర్హుల పేర్లు జాబితాలో కొనసాగకుండా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను కూడా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వి. దేవేంద్ర రెడ్డి, ఓజిలి తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.



