హైదరాబాద్, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి ప్రతినిధి)
ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి సీతక్క, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జస్టిస్ పంచాక్షరి నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా బాలికకు అందుతున్న వైద్య చికిత్స, శస్త్రచికిత్స అనంతర పరిస్థితిపై వైద్య బృందం మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరికి వివరించింది. బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
అనంతరం బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి సీతక్క వారికి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్యంతో పాటు కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున బాధిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయ చెక్కును మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి కలిసి అందజేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, బాలిక చికిత్స, పునరావాసం, కుటుంబ అవసరాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. బాధిత బాలిక సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అవసరమైన ఆర్థిక, న్యాయపరమైన సహాయాన్ని కూడా అందిస్తామని స్పష్టం చేశారు.



