నూతన పాఠ్యపుస్తకాలు, రెడీనెస్ కార్యక్రమాలపై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం
ఆత్మకూరు, జూన్ 5 (హరికిరణ్ ,పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్-3) శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జి. సుధీర్ బాబు గురువారం సందర్శించి పరిశీలించారు. శిక్షణా కార్యక్రమం నిర్వహణ తీరును, ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని, బోధనా విధానాలను ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా జి. సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రాథమిక విద్యా స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. ముఖ్యంగా ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరంలో నూతన విధానాలతో రూపొందించిన పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేలా, సులభంగా అర్థమయ్యే విధంగా కొత్త టెక్స్ట్ బుక్స్ రూపొందించబడినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి రెడీనెస్ పాఠ్యపుస్తకాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు నెల వరకు రెడీనెస్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు.విద్యార్థుల అభ్యాసాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు సామర్థ్య ఆధారిత బోధన, ఆటపాటల ద్వారా నేర్పించే పద్ధతులు, కృత్యాధారిత బోధనను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. తరగతి గదిలో పిల్లల చురుకుదనాన్ని పెంచే విధంగా బోధన సాగాలని, ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి తగిన విధంగా బోధించాలని ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు.అలాగే ఆధునిక సాంకేతికతను విద్యారంగంలో వినియోగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. డిజిటల్ బోధనలో భాగంగా దీక్ష (DIKSHA) ప్లాట్‌ఫామ్‌ను సమర్థవంతంగా వినియోగించాలని, అందులో అందుబాటులో ఉన్న విద్యా వనరులను విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగించాలని సూచించారు. డిజిటల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత, అవగాహన, అభ్యాస నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ శ్రీమతి అనంతలక్ష్మి, ఆత్మకూరు మండల ఎంఈఓ-2 చలపతి, డీఆర్పీలు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులపై అవగాహన పెంపొందించుకుని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని అధికారులు ఆకాంక్షించారు.


