Thursday, 24 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

7 రోజుల్లో న్యాయం,అధికారులకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు!

అనకాపల్లి, సెప్టెంబర్ 7: ​ పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ బాధితులకు లభించే న్యాయమే పోలీసు వ్యవస్థకు అసలైన కొలమానమని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. ఎస్పీ గారు స్వయంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజటి వేదికలో మొత్తం 51 ఫిర్యాదులను స్వీకరించారు. ​​సివిల్ వివాదాలు: భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు.​కుటుంబ సమస్యలు: భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు.​ఇతరాలు: శాంతిభద్రతలు మరియు పౌర సమస్యలు.​ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, అక్కడికక్కడే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కఠిన ఆదేశాలు జారీ చేశారు.ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి బాధితుడికి న్యాయం చేయాలి.ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం నిజాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు జరగాలి.స్టేషన్‌లో కేసు ఏ దశలో ఉందో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపాలి.విచారణ ముగిసిన వెంటనే తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలి. ​”ముఖ్యంగా మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. మహిళలను, సామాన్యులను మోసగించే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతాం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చు. మీకు అండగా నిలవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.” — శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ (జిల్లా ఎస్పీ) ​ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, ఎస్సై శ్రీనివాసరావు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనకాపల్లి

జీవో 21, 31 రద్దు చేయాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల ర్యాలీ, రాస్తారోకో..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ అనకాపల్లి: ఆటో, మోటార్ కార్మికులపై అధిక జరిమానాలకు కారణమవుతున్న జీవో నంబర్ 21, 31ను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, మానవహారం చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని, పెట్రోల్, డీజిల్ ధరలు, పన్నులు, ఇన్సూరెన్స్ భారాలతో జీవనం కష్టంగా మారిందన్నారు. డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లకు నెలకు రూ.10 వేల పెన్షన్, ప్రమాద బీమా, ఉచిత వైద్యం, విద్య అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, సంఘం నాయకులు పెద్దిరెడ్ల నాగేశ్వరరావు, కోరుబిల్లి జగదీష్, మహంతి శాంతి, షేక్ అన్సర్ బేగ్, చంద్రరావు, బాలు, వై.రాజు, అప్పన్నదొర, పి.వెంకటేష్, లోవరాజు, కన్నా అప్పారావు, సీపీఐ నాయకులు వియ్యపు రాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

“ఉత్తమ ఉపాధ్యాయని” సుజాతకు ఘన సన్మానం..

యలమంచిలి : సెప్టెంబర్ 7 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన యలమంచిలి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయిని సారిక సుజాతను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సోమవారం పాఠశాల ఆవరణలో హెచ్‌ఎం సుశీల ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాతను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం సుశీల మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి అంకితభావంతో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న సారిక సుజాత జిల్లా ఉత్తమ అవార్డు అందుకోవడం తమ పాఠశాలకే గర్వకారణమని కొనియాడారు. ఆమె సేవలు తోటి ఉపాధ్యాయులకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ​అనంతరం అవార్డు గ్రహీత సారిక సుజాత మాట్లాడుతూ.. తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంలో సహకరించిన హెచ్‌ఎం, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

అనకాపల్లి

నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వలన నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయని ధరల పెరుగుదల వలన సామాన్య ప్రజల జీవనం అగమ్యగోచరంగా మారిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు పి మాణిక్యం, సిహెచ్ మంగతాయారు అన్నారు. సోమవారం యలమంచిలి పట్నంలో గల మార్కెట్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరలు పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఐద్వా నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుదల ప్రభావం వలన అన్ని నిత్యవసర సరుకులు ధరలు దాదాపు 50% పైగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం లేదని ఫలితంగా మధ్య తరగతి సామాన్య, పేద ప్రజల యొక్క బ్రతుకులు తీవ్ర ఇబ్బందులకు నెట్టి వేయబడ్డాయని తెలిపారు. తక్షణమే నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అవసరమైన 14 రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ శక్తులకు ఆహార పంటలపై హక్కులు కల్పిస్తున్నారని పెద్ద పెద్ద వ్యాపారస్తులు, దళారులు నిత్యవసర సరుకులను బ్లాక్ మార్కెట్లకు తరలించి ధరలు పెరుగుదలకు పాల్పడు తున్నారని విమర్శించారు. ధరలు పెరుగుదలను అరికట్టక పోతే రాష్ట్రావ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్యులు ఈశ్వరమ్మ, సత్యవతి, ఆశ లక్ష్మీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి..!

అనకాపల్లి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి :సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఒకపక్క దేవి దేవతల ఉత్సవాలు, మరో ప్రక్క ఎన్నికల హడావిడితో ప్రజలు సందడిగా ఉంటారని, దీన్ని పరిగణలో తీసుకొని రెండు నెలలు పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. సోమవారం నాడు గ్రామీణ పోలీస్ స్టేషన్లో సచివాలయం మహిళా పోలీసులకు సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ నెలలో జరిగే వినాయక చవితి ఉత్సవాలు, అక్టోబర్ లో జరిగే దసరా వేడుకల్లో ను, అలాగే ఈ రెండు నెలలో జరిగే స్థానిక ఎన్నికలు దృశ్య పోలీసులు అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎటువంటి సంఘటనలు తమ దృష్టిలోకి వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియచేయాలని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు.

అనకాపల్లి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగిసిన పోషకాహార వారోత్సవాలు

అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 7 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) యలమంచిలి :శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబరు మొదటి వారంలో చేపట్టిన పోషకాహార వారోత్సవాలు ముగిశాయి. సోమవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి సోమలింగపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మోహన్ చక్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా డా. మోహన్ చక్రీ మాట్లాడుతూ యువత తమ రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు మరియు గుడ్డు వంటి సమతుల పోషకాహారాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలికి సరైన పోషకాహారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ​అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ పి. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ వి.ఎస్. సత్యనారాయణ, జంతుశాస్త్ర విభాగాధిపతి కె. సుజాత, అధ్యాపకురాలు శశికళ చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

అనకాపల్లి

పేదల పుణ్యయాత్రకు ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండ..!

ఏటికొప్పాక నుంచి ఉచిత తీర్థయాత్రకు భక్తుల పయనం ఎలమంచిలి, సెప్టెంబర్ 7 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భక్తి సేవే.. ప్రజా సేవే లక్ష్యంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏటికొప్పాక గ్రామంలోని శ్రీ బండిమాంబ గుడి వద్ద నుంచి ఉచిత తీర్థయాత్ర బస్సు బయలుదేరింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోలేని పేదలు, వృద్ధులు, భక్తుల కోసం ట్రస్ట్ ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉచిత తీర్థయాత్రలో భాగంగా భక్తులను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలకు తీసుకువెళ్లి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ శ్రీ బలరామ్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత వైద్యం, దేవాలయాల పునర్నిర్మాణం, ఉచిత అన్నదానం తదితర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏటికొప్పాక గ్రామంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని, ప్రజలకు ఏ అవసరం ఉన్నా ట్రస్ట్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి గైపురి రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సెన్నంశెట్టి శ్రీను, కాండ్రకోట చిరంజీవి (మాజీ సర్పంచ్), జనసేన పార్టీ ప్రెసిడెంట్ కొండయ్య నాయుడు, బీజేపీ నాయకులు మొల్లేటి ప్రసాద్, ఎల్‌ఐసీ బాబ్జి, అన్నం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేదలు, వృద్ధులు, భక్తులకు ఉచిత తీర్థయాత్ర సదుపాయం కల్పించడంపై ఏటికొప్పాక గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అనకాపల్లి

యలమంచిలి ‘మనం చారిటబుల్ ట్రస్ట్’ సేవా స్పూర్తి.

యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ క్యాన్సర్తో సతమతమవుతున్న కుటుంబానికి చేయూత… 20 వేల రూపాయల చెక్ అందజేత యలమంచిలి : పట్టణంలోని 10వ తరగతి 1996-97 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులంతా ఏకమై సమాజసేవా సంకల్పంతో స్థాపించిన ‘మనం చారిటబుల్ ట్రస్ట్’ మరోసారి తన సేవా స్పూర్తిని చాటుకుంది. మిత్రుల బాధను తెలుసుకుని సాయం చేయడం ద్వారా నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచింది. 2019లో స్థాపించబడిన ఈ ట్రస్ట్, యలమంచిలి పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఎవరు సహాయం అడిగినా కాదనకుండా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ విశేష ఖ్యాతిని సంపాదించింది. కరోనా తొలి దశలో అందరూ ఇంటికే పరిమితమైన సమయంలో కూడా సభ్యులు బయటకు వచ్చి ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులు అందజేసి యలమంచిలి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా కరోనా రెండవ వేవ్లో ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఆక్సిజన్ సరఫరా చేసి అనేకుల ప్రాణాలను కాపాడారు. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిరాశ్రయులకు చేయూత అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తమ మిత్రుడైన దళపతి బట్ భార్య విద్యా కుమార్ బట్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ట్రస్ట్ సభ్యులు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన సభ్యులు దళపతి బట్కు రూ. 20,000 చెక్కును అందజేసి “మేమంతా ఉన్నాం” అనే ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు మురుకుర్తి గోపి, ఉపాధ్యక్షుడు స్. సతీష్, వ్యవస్థాపక కార్యదర్శి పి. సురేష్, కోశాధికారి సి.హెచ్. శ్యామలరావు, సభ్యులు కర్రి వీరు నాయుడు మాస్టారు, తంగేటి సూర్య ప్రకాష్, అనపర్తి మణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, “సమాజంలో ఎవరు ఏ కష్టంలో ఉన్నా తమ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు. మిత్రుడి కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అవసరమైతే మరింత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నారు.

అనకాపల్లి

సామాజిక అభివృద్ధిలో మీడియా కీలకపాత్ర పోషించాలి,ఎమ్మెల్యే విజయ్ కుమార్.

అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి : సమాజ అభివృద్ధిలో మీడియా కీలకమైన పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా (ఏపీఈఎంజేఏ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దే ఫోర్త్ ఎస్టేట్ గా బాధ్యత పోషిస్తుందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా పత్రికలు ముందుండాలన్నారు. మారుతున్న కాలానుగుణంగా విలేకరులు వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని అన్నారు. విలేకరులు వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు అవసరమైన విధంగా శిక్షణా తరగతులకు తన వంతు ప్రోత్సాహం చేస్తానన్నారు. మీడియా సంఘం నిబద్ధతతో ముందుకు సాగాలన్నారు. యలమంచిలిలో ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటుకు స్థలం మంజూరు చేస్తానన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి విలేకరులకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తానన్నారు. అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుద్ర చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు లు సంఘ అభివృద్ధికి సమన్వయం చేసుకొని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిషోర్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రరావు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే నిబద్ధతతో విలేకరుల సంక్షేమానికి అనునిత్యం పోరాడుతుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ఎల్వీ స్వామి మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నేతల దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. యలమంచిలి నియోజకవర్గంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహం అందించాలన్నారు విలేకరుల శిక్షణా తరగతులకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఎమ్మెల్యే గతంలో హామీ ఇచ్చారని ఆయన హామీనే మనమంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా యలమంచిలి ప్రెస్ క్లబ్ (ఏపీ ఈఎంజేఏ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు గా పల్ల రాజబాబు (సాక్షి ), రమణ (టీవీ5), సుబ్బరాజు (ఈటీవీ), అధ్యక్షునిగా కిషోర్, ప్రధాన కార్యదర్శిగా రామనాయుడు, సహాయ కార్యదర్శిగా చంద్రమౌళి సంతోష్, రమణారావు, రామకృష్ణ, కార్యవర్గ ప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ప్రతినిధులు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సహచర సభ్యులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ హాయ్ సత్యనారాయణ, ప్రత్యేక ప్రతినిధి మూర్తి, ఏపీ యుడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి శ్రీమాన్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఆర్ఎస్ఎస్ శిక్షణ వర్గం.. యువత, ప్రజల ఉత్సాహభరిత భాగస్వామ్యం…!

అభ్యాసం, క్రమశిక్షణ, సేవా భావనపై ప్రత్యేక శిక్షణ యలమంచిలి: ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఏటికొప్పాక అక్షర ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒకరోజు ముఖ్య శిక్షకుల అభ్యాస వర్గ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అగ్రహారపు కుమారస్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా శిక్షణలో భాగంగా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సేవా భావన తదితర అంశాలపై అభ్యాసం నిర్వహించారు. యువతలో సేవా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమనే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఖండ కార్యవాహ పలకా రామస్వామి, ఎలమంచిలి ఖండ సంపర్క ప్రముఖ్ కర్రి త్రినాథరావు, ఎలమంచిలి ఖండ సహ శారీరక ప్రముఖ్ గంజి దుర్గా సాయి, పులపర్తి సంఘ మండల శిక్షణ ప్రముఖ్ దాసరి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యువకులు, ప్రజలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎలమంచిలి ఖండ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.