Sunday, 27 September 2026

Tag: Venky

తిరుపతి

హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఘన స్వాగతం – జనసేన పార్టీ తరఫున వినతిపత్రం అందజేత*

తిరుపతి పర్యటన నిమిత్తం ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్తి ప్రజల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రి గారికి అందజేశారు. *శ్రీకాళహస్తిలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడం, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం వంటి అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు.* వినతిపత్రాన్ని స్వీకరించిన హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీకాళహస్తి ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారితో పాటు జనసేన నాయకులు కుమార్ పాల్గొన్నారు.

తిరుపతి

బీసీల కు 34% రిజర్వేషన్లు పునరుద్ధరణపై హర్షం వ్యక్తంచేసిన దొరవారిసత్రం నాయకులు

దొరవారిసత్రం:-– ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై దొరవారిసత్రం మండలంలోని కూటమి నాయకులు హర్షం వ్యక్తంచేశారు. శనివారం దొరవారిసత్రం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు బీసీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ… దివంగత మహానేత ఎన్టీఆర్ గారు బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అండగా నిలిచి రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే గత ప్రభుత్వం జీవో నెం. 559, 560లతో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి దాదాపు 16,800 మంది బీసీ ప్రతినిధుల రాజకీయ అవకాశాలను దెబ్బతీశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు… నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇంకా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ…బీసీ ల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఇట్టగుంట రత్నయ్య, క్లస్టర్ ఇంచార్జి సంచి విజయకుమార్, మైనారిటి సెల్ నాయకులు SKషబ్బీర్, బట్టా శ్రీనివాసులు, సమాధి సుబ్రమణ్యం, ఊపాటి చెంగయ్య, నేలపట్టు రామయ్య, విజయభాస్కర్, నరసింహులు,యాబాక వెంకటస్వామి, గడ్డాం మంగయ్య, skబాబర్, కాటూరు మణి, పొంకం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులు!*

*30 రోజులు దాటినా అందని సమాచారం.!* ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు తెచ్చిన సమాచార హక్కు చట్టం-2005 అధికారుల అలసత్వం వల్ల తుంగలో తొక్కుతున్నారు.చట్టప్రకా రం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సమాచారం అందించాల్సి ఉండగా, గడువు దాటినా అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *బాధితుడి భూమి హక్కులపై అధికారుల నిర్లక్ష్యం* తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం, పూలతోట పరిధిలోని 3.10 సెంట్ల భూమికి సంబంధించి బాధితుడు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. రీసర్వే ప్రక్రియలో తన భూమి విస్తీర్ణాన్ని 2.50 సెంట్లకు తగ్గించడంపై, దానికి సంబంధించిన కారణాలు, నోటీసులు, ఎఫ్‌ఎమ్‌బీ (FMB) కాపీల వివరాలను సెక్షన్ 6(1) కింద కోరారు. అయితే దరఖాస్తు అంది నెల రోజులు గడిచినా సంబంధిత పౌర సమాచార అధికారి (PIO) నుండి ఎలాంటి స్పందన లేదు. *అక్రమ మట్టి తరలింపు.. అధికారుల మౌనం పై రైతు అనుమానం* ఇదే భూమి 3.10 సెంట్ల సరిహద్దుకు ఆనుకుని ఒక వ్యక్తి అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించాడు. ఆ మట్టిని ఏ ప్రాతిపదికన, ఎవరి అనుమతులతో తరలించారు? అలాగే అతను మట్టి తవ్విన ప్రదేశం ఎవరికి సంబంధించినదో సర్వే చేసి చెప్పాలని కూడా దరఖాస్తులో కోరడం జరిగింది. కానీ ఈ ప్రశ్నకు కూడా అధికారులు సమాధానం దాటవేశారు. దీన్ని బట్టి చూస్తుంటే రైతు భూమి విస్తీర్ణం తగ్గడానికి, అదే ప్రదేశంలో అనధికారికంగా మట్టి తరలించడానికి గల సంబంధాలు స్పష్టమవుతున్నాయని సదరు రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా అధికారులే ఈ అక్రమ మట్టి తరలింపునకు సహకరించారని, అందుకే సమాచారం ఇవ్వడానికి భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. *చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలోపు కోరిన వివరాలు ఇవ్వకపోవడం సమాచారాన్ని తిరస్కరించడంగానే పరిగణించబడుతుంది. అధికారుల ఈ తీరుపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ప్రథమ అప్పీల్ (First Appeal) చేయడానికి సమాయత్తమవుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై సెక్షన్ 20(1) కింద జరిమానా విధించాలని, అలాగే సెక్షన్ 7(6) ప్రకారం అడిగిన సమాచారాన్ని ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు, అక్రమాలపై సమాచారం అడిగితే దాటవేత ధోరణి ప్రదర్శించడం అధికారుల జవాబుదారీతనారాహిత్యానికి నిదర్శనం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితుడి భూమి సమస్యపై స్పష్టమైన సమాచారం అందించి, అక్రమ మట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తిరుపతి

*వాలిన స్తంభం.. పొంచిన ప్రమాదం*

కుప్పారెడ్డిపాలెం దొరవారిసత్రం 22/08/26 పున్నమి న్యూస్ రిపోర్టర్ దొరవారిసత్రం వాలిపోయి ఉన్న విద్యుత్తు స్తంభంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కుప్పారెడ్డిపాలెం సమీపం వ్యవసాయ పొలాల్లో 11 కేవీ విద్యుత్తు లైను స్తంభం వాలిపోయి ఉంది. దీనికి ఉన్న విద్యుత్తు తీగలు కిందకు జారిపోయి ప్రమాదకరంగా మారాయి. తక్కువ ఎత్తులోని తీగలతో పొలాలకు వెళ్లే రైతులు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు పడకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

తిరుపతి

గ్రద్దగుంటలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్‌. వెంకటేశ్వర్‌ సార్

ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా సవరణ ప్రక్రియ చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, వినతుల పరిశీలన ప్రక్రియను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం గ్రద్దగుంట గ్రామంలో జరుగుతున్న పరిశీలన ప్రక్రియను కలెక్టర్‌ స్వయంగా పరిశీలించి, అధికారులు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఓటర్ల నుంచి అందిన ప్రతి అభ్యంతరం, వినతిని నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అనర్హుల పేర్లు జాబితాలో కొనసాగకుండా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను కూడా కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి వి. దేవేంద్ర రెడ్డి, ఓజిలి తహసీల్దార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఘోరం. మూతపడిన ఎక్స్-రే రూమ్. పేషెంట్ల అవస్థలు.

నాయుడుపేట, తేది:19-08-2026, ప్రత్యేక కధనం: ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉచిత వైద్యం అందుతుందని ఆశపడే పేద రోగులకు తిరుపతి జిల్లా, నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది బాధ్యతారాహిత్యం శాపంగా మారింది. మంగళవారం (18-08-2026) మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయానికి ఎక్స్-రే రూమ్‌కు బయటి నుంచి తాళాలు వేసి ఉండటం సంబంధిత అధికారుల తీవ్ర వైఫల్యం అని చెప్పవచ్చు. వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన ఆసుపత్రి వేళల్లోనే ఎక్స్-రే విభాగానికి తాళాలు దర్శనమివ్వడంతో, అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించలేక పేషెంట్ల బంధువులు తాళం వేసి ఉన్న ఎక్స్-రే రూమ్‌ను తమ ఫోన్లలో చిత్రీకరించారు. “అసలు తాళాలు వేసి ఎక్స్-రే తీస్తారా? లేక రోజంతా అసలు ఎక్స్-రే రూమే తెరవలేదా?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సేవలు అందించాల్సిన విభాగం ఇలా తాళాల వెనుక మూలుగుతుంటే పర్యవేక్షణ చేయాల్సిన వైద్యాధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి బాధ్యతారహిత సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గమనిక: నాయుడుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అక్రమాలు, నిర్లక్ష్య వైఖరి మరియు ప్రజలను విస్తుపోయేలా చేసే మరిన్ని సంచలనాత్మక సంఘటనలను ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా త్వరలోనే మీ ముందుకు.

తిరుపతి

స్వర్ణముఖి నదిలో క్షుద్ర పూజలు నిర్వహించారనే ప్రచారంలో వాస్తవం లేదు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నాయుడుపేట. తేదీ: 18-08-2026 – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనంపై నాయుడుపేట పోలీసులు సమగ్ర విచారణ. – దిష్టి పూజ నిర్వహించినట్లు విచారణలో వెల్లడి – క్షుద్ర పూజలు జరిగినట్లు నిర్ధారణ కాలేదు. – వ్యక్తి అనారోగ్యానికి క్షుద్ర పూజలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత. – అసత్యాలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు పోలీసుల సూచన. – సున్నితమైన అంశాలను ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి. తిరుపతి 18: నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీ సమీపంలో గల స్వర్ణముఖి నదిలో 17-08-2026 రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా కొన్ని సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నాయుడుపేట పట్టణ పోలీసులు వెంటనే స్పందించి, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారంపై సమగ్రంగా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, చెన్నై, రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన చిన్నదొరై గణశేఖర్, వయస్సు సుమారు 60 సంవత్సరాలు, కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయన భార్య పద్మావతి. పద్మావతికి నాయుడుపేట ప్రాంతంలో బంధువులు ఉండటంతో, తన భర్తకు ఉన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయనే మూఢనమ్మకంతో, బంధువుల సూచన మేరకు నాయుడుపేట అగ్రహారం ప్రాంతానికి చెందిన కటకం ముత్యాలయ్య అనే వ్యక్తి ద్వారా స్వర్ణముఖి నది వద్ద దిష్టి పూజ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కార్యక్రమంలో భాగంగా దిష్టి తీసే సమయంలో ఒక బొమ్మ/ఆకారం గీసి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగా అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేదా నిర్ధారణ పోలీసుల విచారణలో లభించలేదు. అదేవిధంగా, పూజా కార్యక్రమం అనంతరం చిన్నదొరై గణశేఖర్ అస్వస్థతకు గురైనట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఆయనకు ముందుగానే కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన అస్వస్థతకు గురైన విషయాన్ని క్షుద్ర పూజలతో ముడిపెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వాస్తవ పరిస్థితులకు భిన్నమైనదిగా పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి సూచనల మేరకు ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించే వదంతులు, నిర్ధారణ కాని సమాచారంపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియా వేదికల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని వాస్తవమని భావించకుండా సంబంధిత పోలీసు అధికారుల ద్వారా నిజానిజాలను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల దృష్టికి ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, వదంతులను వ్యాప్తి చేయడం కాకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. – మీడియా మిత్రులకు ప్రత్యేక విజ్ఞప్తి. ప్రజల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్న ఇటువంటి సున్నితమైన అంశాలను ప్రచురించే ముందు సంబంధిత పోలీసు అధికారుల వద్ద వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరడమైనది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్ధారణ కాని కథనాలను యథాతథంగా ప్రచారం చేయకుండా, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే విధంగా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

⛔ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా

⛔రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవోకి వింత పత్రం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ముందు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఇలప నాగేంద్రబాబులు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతాంగం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయని ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా సూళ్లూరుపేట రెవెన్యూ డివిషన్లో అనేక రైతాంగ సమస్యలు ఉన్నాయని బుచ్చినాయుడు కండిగ మండలం వి ఎస్ పురం లో సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వలేదని అలాగే సూళ్లూరుపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో తెలుగు గంగ చీలు కాలువలను పూర్తి చేయాలని, ఆక్రమణలకు గురైన పంట కాలువలను వెలికితీయాలని కోరారు. దాదాపు 1500 ఎకరాల కు నకిలీ విత్తనాల ద్వారా రైతులు మూడు కోట్ల రూపాయల మేర నష్టపోతే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఇప్పటికీ కూడా వారికి తగిన నష్టపరిహారం అందించలేదని నష్టపోయిన రైతాంగం ఎదురుచూపులు తప్పడం లేదని ఇకనైనా బాధిత రైతాంగానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దురాక్రమణ పాలైన నెర్రి కాలువ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిందని, సాగునీరు ప్రవహించాల్సిన నెర్రి కాలువలో మురుగునీరు ప్రవహిస్తుందని కాలువ ఆక్రమణలను తొలగించి పరిశుభ్రమైన సాగునీటిని రైతన్నలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రమణయ్య శ్రీనివాసులు,ఆనంద్ బాబు ఓ కుమార్ బాలు రజిని చంచమ్మ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఉత్తమ రీడర్లకు విద్యుత్ శాఖలో ఘన సత్కారం*

తిరుపతిజిల్లా దొరవారిసత్రం: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికగా దొరవారిసత్రంమండలానికి చెందిన ఎంపీఈవో వల్లిపి గ్రేస్ సముచిత గౌరవాన్ని అందుకున్నారు. గత 11 సంవత్సరాలుగా అనగా 2015 నుండి 2026వరకు ఆమె అందించిన నిరుపమాన సేవలను గుర్తిస్తూ, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావ్ గారి చేతులమీదుగా ఆమె ఈ ప్రతిష్టాత్మక “ఉత్తమ ఎంపీఈవో” పురస్కారాన్ని స్వీకరించారు. *నిబద్ధతకు దక్కిన సముచిత గౌరవం:* వల్లిపి గ్రేస్ అందుకున్న ఈ అవార్డు కేవలం ఒక ప్రశంసాపత్రం మాత్రమే కాదు.క్షేత్రస్థాయిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి దశాబ్ద కాలానికి పైగా చూపిన నిరంతర శ్రమకు, నిలకడైన నిబద్ధతకు దక్కిన ఘన సత్కారం. 2015లో విధి నిర్వహణలో చేరిన నాటి నుండి నేటి వరకు ఆమె ప్రస్థానం ఎంతో స్పూర్తిదాయకం. సచివాలయ వ్యవస్థ రాకముందు ఆమె దొరవారిసత్రం మండలమంతా విస్తృతంగా పనిచేసి రైతాంగానికి అండగా నిలిచారు. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చిన కొత్తలో కొత్తపల్లి సచివాలయ పరిధిలో తన మార్కు సేవలను అందించారు. ప్రస్తుతం నెలబల్లి సచివాలయంలో ఎంపీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు సాంకేతిక, నైతిక మద్దతును అందిస్తూవస్తున్నారు.ఒక ఎంపీఈవోగా కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రతి చేనుకూ వెళ్ళి రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంలో ఆమె చూపిన చొరవ అమోఘం. విత్తన శుద్ధి, చీడపీడల నివారణ, ఈ-క్రాప్ బుకింగ్ వంటి ప్రభుత్వ సంక్షేమ పధకాలు ను ప్రతి రైతుకూ పారదర్శకంగా చేర్చడంలో ఆమె అత్యంత కీలక పాత్ర పోషించారు.సాధారణ విధులతో పాటు రైతుల కోసం ప్రత్యేక క్యాంపైన్‌లను ఏర్పాటు చేసి, వారిని నేరుగా వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు తీసుకెళ్ళి అక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికతపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడంలో ఆమె చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం.తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో, జిల్లా ఉన్నతాధికారులు మరియు వేలాది మంది ప్రజల సమక్షంలో జిల్లా వ్యవసాయ అధికారి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకోవడం దొరవారిసత్రం మండలానికే గర్వకారణం. విధి నిర్వహణలో అలసత్వం వహించే ఎంతోమందికి వల్లిపి గ్రేస్ ఒక దిక్సూచిలా, రోల్ మోడల్‌గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

తిరుపతి

L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: 500 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

నాయుడుపేటలోని L.A. సాగరం హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని స్కూల్ కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్ ఆవిష్కరించగా స్కూల్ ఆవరణంలోపండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆకట్టుకున్న 500 అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా 500 అడుగుల పొడవైన జాతీయ జెండా నిలిచింది. L.A. సాగరం పాఠశాల ప్రాంగణం నుండి గాంధీ విగ్రహం (గాంధీ బొమ్మ) వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, లతో కలిసి భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పట్టుకున్న భారీ త్రివర్ణ పతాకం నాయుడుపేట వీధుల్లో కన్నులపండువగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు (మాజీ ఎంపీ) నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం, ఆయన విద్యార్థినీ విద్యార్థులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పాఠశాల కమిటీ చైర్మన్ నెలవల చంద్రశేఖర్, వైస్ చైర్మన్ జమీలా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్.ఎం) సుబ్రహ్మణ్యం విశిష్ట పాత్ర పోషించారు. పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్ అసలు గంగ ప్రసాద్ కరీం భాయ్ చెంచయ్య మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.