Sunday, 13 September 2026

Tag: Nellore News

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి : వై.ఓ. నందన్

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో పారిశుధ్య పనులను మరింత సమర్థంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశించారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శానిటేషన్ విభాగంతో నిర్వహించిన సమీక్షలో డ్రైన్ల పూడికతీత, చెత్త తొలగింపు, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రతిరోజూ స్ప్రేయింగ్, ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. GVPలు, బ్లాక్‌స్పాట్లను గుర్తించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. సిబ్బంది యూనిఫామ్‌తో విధులకు హాజరై, వార్డు వర్కర్ల హాజరును నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, డాక్టర్ జిజియా, డాక్టర్ మదన్మోహన్, శానిటరీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వేమిరెడ్డిపై ఆరోపణలు నిరూపించాలి: రూప్ కుమార్

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న ఆరోపణలను నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకుండా రాష్ట్రానికి దూరంగా ఉన్న అనిల్ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే వేమిరెడ్డి సొంత నిధులతో ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. సైదాపురం క్వార్ట్జ్ మైన్ల విషయంలో వేమిరెడ్డి రూ.8 వేల నుంచి రూ.10 వేలు అడిగారన్న అనిల్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ ఆరోపణను ఒక్క మైన్ యజమానితో నిరూపించినా దేనికైనా సిద్ధమని రూప్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రూ.1,000 కోట్లతో ప్రతిపాదించిన క్వార్ట్జ్ ఫ్యాక్టరీ వ్యాపారం నుంచి వేమిరెడ్డి ఏడాది క్రితమే తప్పుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో అనిల్‌కు ప్రాధాన్యం లేకపోవడంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వేమిరెడ్డి స్థాయి, సేవలు ప్రజలకు తెలుసని, అనిల్ రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి: ఏపీటీఎఫ్ ధర్నా

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. 2010కు ముందు ఉద్యోగంలో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య స్పెషల్ టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి, బోధించే సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జుల్ఫికర్ ఆలీ, బాలత్రిపుర సుందరి, రియాజ్ పిచ్చిబాబు, కరీం మొహిద్దిన్, ఖాదర్ బాషా, మహేంద్ర రెడ్డి, రాజశేఖర్, విజయభారతి, సుంకు వెంకటేశ్వర్లు, జైపాల్ రెడ్డి, రత్నయ్య, యాసిన్, గుప్తా, రామసుబ్బారెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, రమణయ్య, పెంచలయ్య, రామ్మోహన్ రెడ్డి, కొండారెడ్డి, రత్నారెడ్డి, మహేష్, వెంగయ్య పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యలపై శాశ్వత పరిష్కారానికి చర్యలు

నెల్లూరు నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ. నందన్ ప్రజల నుంచి మొత్తం 50 వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా శాశ్వత పరిష్కారం అందిస్తామని మేయర్ తెలిపారు. నగరంలో రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. నవాబుపేట, మేకలమండి, మినీ బైపాస్, ఎన్టీఆర్ పార్కు ప్రాంతాల్లో ఆక్రమణల నివారణకు ప్రత్యేక కమిటీ ద్వారా చర్యలు చేపడతామన్నారు. వీధి వ్యాపారులు నిర్దేశించిన రోడ్డు మార్జిన్‌లోనే వ్యాపారం చేయాలని సూచించారు. నిర్మాణ సామగ్రి, వ్యర్థాలను రోడ్లపై వదలరాదని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాలను నగరపాలక సంస్థ ద్వారా తరలించేందుకు 94940 18118 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్, ఆరోగ్య, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులతో కలిసి బుధవారం స్థానిక మినీ బైపాస్ అన్నమయ్య కూడలి సమీపంలోని జాకీ షోరూం పరిసర ప్రాంతాలలో పర్యటించారు. సమస్యలు పునరావృతం కాకుండా వాటికి శాశ్వతంగా పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం సమీపంలోని వెంగన్న కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సర్వేయర్ కామేశ్వరరావు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.