Tuesday, 29 September 2026

Tag: karthik yadav

కడప

క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి పున్నమి ప్రతినిధి కడప, సెప్టెంబర్ 23 కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆమె స్వయంగా అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మాధవి రెడ్డి తెలిపారు. క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా పర్యవేక్షిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి పున్నమి ప్రతినిధి కడప, సెప్టెంబర్ 23 కడప నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 3వ డివిజన్‌కు సంబంధించిన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 66 డివిజన్లలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. పార్టీ సభ్యులందరికీ ఐడీ కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యానాదయ్య, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడప

గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం

గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 కడప: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సాప్) కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్ఆర్ టీయూసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కడప ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు ఎం. జాషువా, కడప నగర అధ్యక్షులు ఎన్. నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. శ్రీధర్, రాష్ట్ర జాయింట్ కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి, కడప నగర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ ఖాన్, కమలాపురం మండల అధ్యక్షులు లింగారెడ్డి ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమస్యపై స్పష్టత ఇవ్వకుండా ఉద్యమకారులపై పోలీసు చర్యలకు పాల్పడటం సరికాదని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని, నియామకాలకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కడప

నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం నామఫలకం వెంటనే పునఃస్థాపించాలి కడపలో నేక్‌నామ్ ఖాన్ పేరుతో శాశ్వత స్మారక గుర్తింపు ఏర్పాటు చేయాలి — కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్

నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం నామఫలకం వెంటనే పునఃస్థాపించాలి కడపలో నేక్‌నామ్ ఖాన్ పేరుతో శాశ్వత స్మారక గుర్తింపు ఏర్పాటు చేయాలి — కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21, కడప: కడప చరిత్రతో ముడిపడి ఉన్న నేక్‌నామ్ ఖాన్ గారి జ్ఞాపకాన్ని శాశ్వతంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి (DRO)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ, 17వ శతాబ్దంలో కుతుబ్‌షాహీ కాలంలో నేక్‌నామ్ ఖాన్ కడప పట్టణ విస్తరణకు విశేష కృషి చేశారని తెలిపారు. కడపలో విద్యా, కళా అభివృద్ధితో పాటు సామాజికంగా నగర ప్రగతికి ఆయన చేసిన సేవలు చరిత్రలో గుర్తుండిపోయేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన కడపకు చేసిన సేవల కారణంగానే “నేక్‌నమాబాద్” అనే పేరు కడప చరిత్రలో ప్రస్తావించబడుతుందని తెలిపారు. మరమ్మతుల సమయంలో తొలగించిన “నేక్‌నామ్ ఖాన్ కళాక్షేత్రం” నామఫలకాన్ని వెంటనే పునఃస్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల అనుమతితో నామఫలకాన్ని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా కడప నగరంలో ఒక పార్కు, గార్డెన్, సర్కిల్ లేదా తగిన ప్రజా ప్రదేశానికి నేక్‌నామ్ ఖాన్ పేరు పెట్టి ఆయన సేవలను శాశ్వతంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను సమర్పించిన వినతిపత్రంపై DRO సానుకూలంగా స్పందించారని గౌస్ పీర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన బాధ్యతను కడప మున్సిపల్ కార్పొరేషన్ (KMC)కి అప్పగించడంతో పాటు, KMC కమిషనర్‌తో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, డివిజన్ ఇంచార్జిలు మహబూబ్ భాషా, సిద్ధిక్, సయ్యద్ అన్వర్, మురాద్, గఫార్, ఆరిఫ్, సర్దార్ భాష, సుబ్రహ్మణ్యం, హాజీ భాయ్, గౌరీ దేవి, హమీదా ఖానం తదితరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప

సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలు 24 గంటల్లోనే సేఫ్ కడప నుంచి తిరుపతి.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తింపు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కదలికల గుర్తింపు

సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలు 24 గంటల్లోనే సేఫ్ కడప నుంచి తిరుపతి.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తింపు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కదలికల గుర్తింపు పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 కడప జిల్లా: కడప నగరంలోని సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలను కడప టూ టౌన్ పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా ట్రేస్ చేశారు. బాలికలు కడప నుంచి తిరుపతికి, అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. టూ టౌన్ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి బాలికల ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాలికల కదలికలను పోలీసులు గుర్తించారు. బాలికలు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి వెళ్లి వారిని సురక్షితంగా ట్రేస్ చేసింది. అనంతరం బాలికలను కడపకు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. మిస్సింగ్ కేసులో వేగంగా స్పందించి కేవలం 24 గంటల్లోనే బాలికల ఆచూకీ గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంపై టూ టౌన్ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రత్యేక పోలీసు బృందం పనితీరును జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ అభినందించారు. మిస్సింగ్ కేసుల్లో వెంటనే స్పందించి బాధితుల ఆచూకీని వేగంగా గుర్తించేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. బాలికలు, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మిస్సింగ్ ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

కడప

రాష్ట్రంలోనే అత్యంత మహిమాన్విత ఆలయం పులివెందుల శ్రీ రంగనాథ ఆలయం

రాష్ట్రంలోనే అత్యంత మహిమాన్విత ఆలయం పులివెందుల శ్రీ రంగనాథ ఆలయం పున్నమి ప్రతినిధి పులివెందుల, సెప్టెంబర్ 19: పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయం రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనూ అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రమని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, అభ్యుదయ ఫౌండేషన్ సీఈఓ కే. నందకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని కావేరి నది తీరంలో ఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం, శివసముద్రం వంటి ప్రముఖ క్షేత్రాల తరహాలో పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి కూడా విశిష్టత ఉందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులు పులివెందుల శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తి పొందవచ్చని తెలిపారు. శయన స్థితిలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాలను భక్తులు క్రమం తప్పకుండా దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. పులివెందుల ఆలయంలో ప్రతి శుక్రవారం శ్రీ రంగనాథ స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు ఆరు వారాల పాటు తులసి మాలలు సమర్పించడం భక్తుల విశ్వాసాల ప్రకారం శుభప్రదమని వివరించారు. ఆలయంలో విష్ణు పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, హోమాలు, జపతపాలు, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఆలయ ప్రాధాన్యతను కాపాడుతూ మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పులివెందుల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని గతంలో రామానుజాచార్యులు, వారి శిష్యులు, భట్టాచార్యులు, అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయలు వంటి ప్రముఖులు దర్శించారని నందకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించానని, ఆలయానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నానని నందకిషోర్ రెడ్డి చెప్పారు. ఆలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిరంతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు అంతకుముందు శ్రీ రంగనాథ స్వామికి నందకిషోర్ రెడ్డితో పాటు సుమన్ టీవీ భక్తి ఛానల్ సీఈఓ గీతాంజలి, భక్తి ఛానల్ డైరెక్టర్ కార్తీక్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి పలు కార్యక్రమాలు, పూజా విధానాలపై చర్చించారు. అనంతరం తూర్పు వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి, తూర్పు వీరాంజనేయ స్వామి ఆలయాల చరిత్ర, పురాణ కథనాలను ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ అల్లం రంగనాయకులు రాయల్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.వి. రమణ, పూజారులు శశిధర్ శర్మ, నరసింహ శర్మ, కృష్ణ రాజేష్ శర్మ, డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రామిశెట్టి శివశంకర్, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత ఆరవేటి నారాయణరెడ్డి, మానవత సంస్థ ప్రతినిధులు రిటైర్డ్ కొండారెడ్డి, దినేష్ గుప్తా, మల్లికార్జున, టీడీపీ నాయకుడు జ్ఞానేశ్వర్ నాయుడు, పలువురు హిందూ జేఏసీ నాయకులు, హిందూ ప్రతినిధులు పాల్గొన్నారు.

కడప

గణేష్ ఉత్సవాల్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్

గణేష్ ఉత్సవాల్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19 కడప: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కడప నగరంలోని మాసాపేట 6వ వీధిలో రాములవారి ఆలయం వద్ద ఏ.ఆర్.వి. యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజలకు ఎప్పుడు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని గౌస్ పీర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా కార్యక్రమాలకు పార్టీ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. రాబోయే కడప కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం లభించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏ.ఆర్.వి. యూత్ కమిటీ సభ్యులు సాయి, మురళీకృష్ణ తదితరులు గౌస్ పీర్‌ను ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, ఫజరుల్లా, సౌధాకర్, సాదిక్, డివిజన్ ఇన్‌చార్జులు మహబూబ్ బాషా, ముబారక్, సయ్యద్ అన్వర్, షేక్ అన్వార్, సిద్ధిక్, మురాద్, ఆరిఫ్, హేమచంద్ర, ఏ.ఆర్.వి. యూత్ సభ్యులు ఎన్.డి. విజయ్, చైతన్య తదితర కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కడప

దళిత మహిళను అవమానించిన తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలి

దళిత మహిళను అవమానించిన తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలి అర్హత ఉన్నా సావిత్రమ్మకు పింఛన్ ఎందుకు ఇవ్వరు? ‘దళితులు వస్తే పని చేయాలా?’ అంటూ అధికారులు మాట్లాడటం దురదృష్టకరం కలెక్టర్ స్పందించకపోతే MRO కార్యాలయం ముట్టడిస్తాం రాజంపేట టీడీపీ మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19 రాజంపేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిరుపేద దళితులకు అన్యాయం జరుగుతోందని రాజంపేట నియోజకవర్గ టీడీపీ మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ ఆరోపించారు. ఒంటిమిట్ట మండలం మల్లేశ్వరపురం గ్రామానికి చెందిన దళిత వృద్ధురాలు చెరువుపల్లి సావిత్రమ్మకు పింఛన్ మంజూరు చేయకపోవడం, ఒంటరి మహిళ సర్టిఫికెట్ కోసం ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుబ్బమ్మ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్లేశ్వరపురానికి చెందిన చెరువుపల్లి సావిత్రమ్మకు 55 సంవత్సరాల వయస్సు ఉందని, ఆమెకు పిల్లలు, భర్త లేరని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డుల్లో కూడా భర్త పేరు లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమె ఒంటరి మహిళ పింఛన్‌కు అర్హురాలని సుబ్బమ్మ పేర్కొన్నారు. ఒంటరి మహిళ సర్టిఫికెట్, పింఛన్ కోసం సావిత్రమ్మ MRO కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, కార్యాలయ సిబ్బంది దళిత మహిళ పట్ల అవమానకరంగా మాట్లాడినట్లు ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దళిత మహిళ పట్ల అధికారులు కులవివక్ష చూపినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వాస్తవాలను విచారించాలని సుబ్బమ్మ కోరారు. సావిత్రమ్మకు తక్షణమే ఒంటరి మహిళ సర్టిఫికెట్ జారీ చేసి, ఆమెకు అర్హత ఉంటే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించి సావిత్రమ్మకు న్యాయం చేయకపోతే ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని కోటపాటి సుబ్బమ్మ హెచ్చరించారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

కడప

జువాలజీ పరిశోధకురాలు కుమారి వెంకట భాగ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్

జువాలజీ పరిశోధకురాలు కుమారి వెంకట భాగ్యశ్రీకి వైవీయూ డాక్టరేట్ కడప, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): యోగి వేమన విశ్వవిద్యాలయం జువాలజీ పరిశోధక విద్యార్థిని కుమారి వెంకట భాగ్యశ్రీకి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. జంతుశాస్త్ర శాఖ ఆచార్యులు ఎస్‌.పీ. వెంకటరమణ పర్యవేక్షణలో “భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మైదాన, కొండ ప్రాంతాలలో ఉష్ణమండల పియరిడ్ సీతాకోకచిలుకల వైవిధ్యం, విస్తరణ, జీవావరణ జీవశాస్త్రం” అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. కుమారి వెంకట భాగ్యశ్రీ తన పరిశోధనలో భాగంగా రూపొందించిన పలు పరిశోధనా వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. డాక్టరేట్ అందుకున్న సందర్భంగా భాగ్యశ్రీని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, కులసచివులు ఆచార్య ఎన్‌.సి. గంగిరెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య టి. శ్రీనివాస్, పరిశోధనా పర్యవేక్షకులు, కన్వీనర్, విభాగాధిపతి ఆచార్య వి. అనుప్రసన్న, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.

కడప

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో విద్యార్థులకు తడి, పొడి చెత్త విభజనపై అవగాహన

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో విద్యార్థులకు తడి, పొడి చెత్త విభజనపై అవగాహన కడప, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శ్రీ రాకేశ్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం నగర పరిధిలోని గాంధీనగర్ స్కూల్ వద్ద విద్యార్థులకు తడి చెత్త, పొడి చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దనే వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసే ప్రక్రియను స్వయంగా నిర్వహించి, చెత్త విభజనపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ ఇళ్లలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా తడి, పొడి చెత్త విభజనపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.