గొల్లపూడిలో మూడో తరం రాజకీయ వారసత్వానికి శ్రీకారం!
ఘనంగా ఎన్డీఏ కూటమి టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయి గారి నామినేషన్.
నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, నవంబర్ 15:
గొల్లపూడి గ్రామ రాజకీయ చరిత్రలో బొమ్మసాని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మూడు తరాలుగా గ్రామ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ఈ కుటుంబం నుంచి ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల బరిలోకి మూడో తరం నాయకుడిగా బొమ్మసాని జయంత్ సాయి గారు అడుగుపెట్టారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ముందుకు సాగుతున్న ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా బొమ్మసాని జయంత్ సాయి గారి నామినేషన్ కార్యక్రమం పార్టీ శ్రేణుల ఉత్సాహం మధ్య అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అనంతరం బొమ్మసాని జయంత్ సాయి గారు ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
మూడు తరాలుగా గ్రామ రాజకీయాల్లో బొమ్మసాని కుటుంబ ప్రస్థానం.
గొల్లపూడి గ్రామ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే బొమ్మసాని కుటుంబం ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. 1959 నుంచి 1970 వరకు రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బొమ్మసాని కృష్ణమూర్తి గారు సర్పంచిగా బాధ్యతలు నిర్వహించి గ్రామానికి సేవలందించారు.
ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు బొమ్మసాని సుబ్బారావు గారు 1995లో తొలిసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం 2001 నుంచి 2006 వరకు ఉపసర్పంచిగా, 2006 నుంచి 2011 వరకు సర్పంచిగా పనిచేశారు. మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా ప్రతినిధిగా వ్యవహరించి గ్రామ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు.
ఇప్పుడు ఆయన కుమారుడు బొమ్మసాని జయంత్ సాయి గారు ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవడంతో బొమ్మసాని కుటుంబం నుంచి మూడో తరం నాయకత్వం గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లయింది.
గ్రామాభివృద్ధికి కూటమి అభ్యర్థికి అండగా నిలవాలి: ఎమ్మెల్యే వసంత.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గొల్లపూడి గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. కూటమి అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయి గారికి ప్రజలు తమ సంపూర్ణ మద్దతు అందించి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్థాయిలోనూ మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరాలంటే స్థానిక సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం, సమర్థ నాయకత్వం అవసరమని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామమోహనరావు (గాంధీ), బీజేపీ నాయకులు, విజయవాడ రూరల్ జెడ్పీటీసీ నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల), తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

