Tuesday, 29 September 2026

Tag: Kadapa

కడప

స్పెషల్ టెట్‌తో ఒరిగేదేముంది? 40 శాతం అర్హత మార్కులతో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలి యుటిఎఫ్ కడప జిల్లా శాఖ డిమాండ్

స్పెషల్ టెట్‌తో ఒరిగేదేముంది? 40 శాతం అర్హత మార్కులతో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలి యుటిఎఫ్ కడప జిల్లా శాఖ డిమాండ్ కడప, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఎలాంటి రాయితీలు లేకుండా, ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న స్పెషల్ టెట్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్షుడు మాదన విజయకుమార్, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులతో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం కడప జిల్లా కలెక్టరేట్ వద్ద స్పెషల్ టెట్ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా పాత విధానాన్నే కొనసాగిస్తూ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం “కొత్త సీసాలో పాత సారా” చందంగా ఉందని విమర్శించారు. 2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చి ఉపాధ్యాయ నియామకాలకు టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేసిందని తెలిపారు. అయితే 2010కు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు ఇప్పటికే నిర్దేశిత అర్హతలు సాధించి వృత్తిలోకి వచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిలో అనేక మంది 30 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్నవారు, 50 ఏళ్లు పైబడినవారు ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి చేయడం ద్వారా వారి మెడపై కత్తి వేలాడదీయడం తగదన్నారు. విద్యాహక్కు చట్టం-2010లోని సెక్షన్ 23(1)కు సవరణ చేసి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. టెట్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్ కంటే ఎక్కువగా, అత్యంత కఠినంగా ఉంటోందని వారు ఆరోపించారు. ఉపాధ్యాయుల బోధనకు సంబంధం లేని అంశాలపై పరీక్షలు రాయాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. పాఠశాలల్లో బోధనతో పాటు కుటుంబ బాధ్యతలు, వయసు రీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యల మధ్య టెట్‌కు సిద్ధమై ఉత్తీర్ణత సాధించడం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కష్టతరమవుతోందన్నారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, అందులో తాము కోరిన రాయితీలను ప్రభుత్వం కల్పించలేదని అన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 40 శాతం అర్హత మార్కులు నిర్ణయించాలని, ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని, గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పెషల్ టెట్‌లో 40 శాతం అర్హత మార్కులు ప్రవేశపెట్టాలని, ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని, టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆగస్టు 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, సెప్టెంబర్ 3న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని యుటిఎఫ్ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై. రవికుమార్, ట్రెజరర్ కె. నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్. ఎజాస్ అహ్మద్, జి. గోపీనాథ్, డి.వి. సుబ్బారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి. కృష్ణారెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రాజశేఖర రాహుల్, సరస్వతి, యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రామ కేశవ, చెన్నయ్య, హిపాజతుల్లా, కాయపాటి రామాంజనేయులు, నాగేంద్ర, నాగరాజు, గీత తదితరులు పాల్గొన్నారు.

కడప

సేవా భావమే యువత ఉపాధేయ లక్ష్యం

సేవా భావమే యువత ఉపాధేయ లక్ష్యం కడప, పున్నమి ప్రతినిధి: సేవా భావంతో యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సర్వమంగళం స్వీట్ సెంటర్ ప్రొప్రైటర్స్ సుబ్బమ్మ, నారాయణ, నరేంద్ర కుమార్ తెలిపారు. కడప నగరంలోని కొత్త బస్టాండ్ ఆర్‌ఎస్ రోడ్డు, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్వమంగళం స్వీట్ సెంటర్ను సోమవారం వారు లాంఛనంగా ప్రారంభించారు. సాంప్రదాయబద్ధంగా మహిళలు హారతులు పట్టగా, వేద మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి షాపులోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ సర్వమంగళం స్వీట్ సెంటర్‌లో సరసమైన ధరలకు అన్ని రకాల స్వీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రుచి, శుచి, శుభ్రత, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్వీట్ల తయారీలో స్వచ్ఛమైన ఆవుపాలను వినియోగిస్తున్నామని, ప్రత్యేకంగా బెంగాల్ నుంచి నిపుణులైన స్వీట్ తయారీ కార్మికులను తీసుకువచ్చి స్వీట్లు తయారు చేయిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా రుచికరమైన, సువాసనతో కూడిన బెంగాల్ స్వీట్లు తమ వద్ద అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే షుగర్‌లెస్ స్వీట్లు అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. ఇంపోర్టెడ్ చాక్లెట్లు, వివిధ రకాల స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కస్టమర్ల ఆర్డర్‌కు అనుగుణంగా లడ్డూలను తయారు చేసి అందిస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూకు ఉపయోగించే ఫ్లేవర్స్‌ను వినియోగిస్తూ నాణ్యమైన లడ్డూలను తయారు చేస్తామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. కస్టమర్లు ఒక్కసారి తమ స్వీట్ సెంటర్‌ను సందర్శించి స్వీట్లను రుచి చూసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. శుభకార్యాలు, వివాహాలు, ఇతర ఫంక్షన్లకు అవసరమైన స్వీట్లు, ఆర్డర్లను డెలివరీ చేస్తామని తెలిపారు. ఆర్డర్ల కోసం 9959257955 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, నరసింహ, లక్ష్మయ్య, గోపాల్, ఎం. రాజశేఖర్‌తో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

కడప

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రారంభోత్సవం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రారంభోత్సవం కడప జిల్లా ఇంద్రానగర్‌లోని శ్రీ భద్రాద్రి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్మాణం పూర్తి చేసి, గురువారం 27-08-2026న దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏటూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. తేదీ: 27-08-2026, గురువారం వేదిక: శ్రీ భద్రాద్రి దేవస్థానం, ఇంద్రానగర్, కడప ఆధ్వర్యం: ఏటూరి రామచంద్ర రెడ్డి

కడప

వందేమాతరం గీతం 150 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి

వందేమాతరం గీతం 150 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి పున్నమి ప్రతినిధి: వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు వందేమాతరం చరిత్ర, ప్రాధాన్యతను తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులకు దేశభక్తి, జాతీయ సమైక్యతపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోత రమేష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామినేని ప్రవీణ్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేపూరి శారదమ్మ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హిమగిరి యాదవ్, బీజేపీ నాయకులు సింగన సుబ్బారెడ్డి, బీజేవైఎం నాయకులు చాగలమరి ఓబులేసు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

కడప

వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన

వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పున్నమి ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన” సమావేశంలో టిటిడి బోర్డు మాజీ సభ్యులు, ఎస్‌ఈసీ సభ్యులు సిద్ధవటం యానాదయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కడప

కూటమి ప్రభుత్వంలో వరుస విద్యార్థుల మరణాలు : వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం

కూటమి ప్రభుత్వంలో వరుస విద్యార్థుల మరణాలు : వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సెట్టూరులో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అనంతపురం, ఆగస్టు 24: కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పాడుబడిన గోడ కూలి దళిత విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందిన ఘటనపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వార్డెన్ నిర్లక్ష్యం, సంబంధిత డి.డి. పర్యవేక్షణ లోపం, కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలు, హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులు, మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలను గుర్తించి మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే పేద కుటుంబానికి చెందిన దళిత విద్యార్థి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థి అక్షయ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని, అతనికి అవసరమైన మెరుగైన వైద్య చికిత్సతో పాటు మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వసతి గృహ వార్డెన్‌తో పాటు సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం రుజువైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన విద్యార్థి హర్షవర్ధన్ కుటుంబానికి కనీసం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై సమగ్ర రివ్యూ, ఆడిట్ నిర్వహించాలని, ప్రమాదకర భవనాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు. హాస్టళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి వసతి గృహాలను అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విద్యార్థి సంఘాల నాయకులను హాస్టళ్లు, పాఠశాలల్లోకి అనుమతించకుండా తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే సంఘాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యతను విస్మరించి కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారని చంద్రశేఖర్ యాదవ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులు కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు. సెట్టూరు ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, సెట్టూరు మండల అధ్యక్షులు నవీన్, నాయకులు హరీష్, చరణ్, రెడ్డి సాహిద్, రఫీ, శేఖర్, గౌస్, రాఘవ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. పున్నమి ప్రతినిధి

కడప

9వ వార్డు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

9వ వార్డు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం – కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ కడప, ఆగస్టు 23: పున్నమి ప్రతినిధి కడప నగరపాలక సంస్థ పరిధిలోని 9వ వార్డును అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి నగరంలోనే నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 9వ వార్డు పరిధిలోని పలు కాలనీలు, వీధుల్లో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచార పర్యటన సందర్భంగా స్థానికులు వార్డులో నెలకొన్న పలు సమస్యలను బత్తల పవన్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ లోపం, చెత్త తొలగింపు, వీధి దీపాల సమస్యలతో పాటు పలు కాలనీల్లో సీసీ రోడ్ల మరమ్మతుల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా బత్తల పవన్ కుమార్ మాట్లాడుతూ.. గత పాలకులు 9వ వార్డు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కనీస మౌలిక వసతులు సైతం సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి కార్పొరేటర్‌గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నాణ్యమైన రోడ్లు, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, నిరంతర తాగునీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. 9వ వార్డును కడప నగరంలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని బత్తల పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు ప్రముఖ నాయకులు గౌరీ శంకర్, గంగాధర్, కృష్ణారెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు, యువజన విభాగం ప్రతినిధులు, వార్డు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కడప

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

విశ్వనాధపురంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కడప, ఆగస్టు 23: పున్నమి ప్రతినిధి విశ్వనాధపురంలో ఆదివారం “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం – అభివృద్ధి” నినాదంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ ఇన్‌చార్జ్ షేక్ శిరాజ్ బాషా, బూత్ కన్వీనర్ అతికారి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారని వారు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప

18వ డివిజన్‌లో డోర్ టు డోర్ టీడీపీ కార్యక్రమం

18వ డివిజన్‌లో డోర్ టు డోర్ టీడీపీ కార్యక్రమం కడప, ఆగస్టు 24: కడప నగరంలోని 18వ డివిజన్‌లో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, అధికారులు, టీడీపీ నాయకులు డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్లో సాధ్యమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను తీసుకొచ్చినప్పుడు వారికి తగిన సూచనలు, సలహాలు అందించాలని, సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. రెండు నెలల్లో విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి ప్రారంభిస్తాం అనంతరం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు ఇస్తామని కార్పొరేషన్ అధికారులు గతంలో హామీ ఇచ్చినప్పటికీ అనంతరం నిధులు ఇవ్వలేమని చెప్పడంతో పనులు ఆలస్యమయ్యాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక కలెక్టర్ ద్వారా అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిధులు ఆర్డీఓ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు చేపట్టామని, త్వరలోనే నిధులు జమ చేసి పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం పాలనలో చిన్నచిన్న సమస్యలు మినహా ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల నాగేశ్వరరెడ్డి, గంధం మోహన్, కృష్ణారెడ్డి, రామసుబ్బయ్య, సాయికుమార్, ప్రసాద్, పవన్ కుమార్, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

కడప

దేవుని కడపలో అష్టబంధన మహా సంప్రోక్షణ

దేవుని కడపలో అష్టబంధన మహా సంప్రోక్షణ కడప, ఆగస్టు 23: పున్నమి ప్రతినిధి కడప నగరంలోని ప్రసిద్ధ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ పవిత్ర కార్యక్రమాలను నిర్వహించేందుకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణాలు తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. దేవుని కడప ఆలయానికి ఉన్న విశిష్టత దృష్ట్యా ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 24, 25 తేదీల్లో వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించనుండగా, ఆగస్టు 26న మహా సంప్రోక్షణకు సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు జరగనున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమాలతో దేవుని కడప ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.