Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

జనగామ పట్టణం లోని పలు ప్రాంతాల్లో మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్ :రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ జనగామ

జనగాం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్ ———————————————————————— జనగాం పురపాలక సంఘం పరిధిలో దోమల నివారణ మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో **మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని** పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని నివాస ప్రాంతాలు, మురుగు కాలువలు, నీరు నిలిచే ప్రదేశాలు, దోమల ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి ఆయిల్ స్ప్రేయింగ్ చేపట్టారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని గౌరవ చైర్పర్సన్ గారు మరియు గౌరవ కమిషనర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ & కమిషనర్ మాట్లాడుతూ, **ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని** సూచించారు. పురపాలక సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య, దోమల నియంత్రణ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలోని అవసరమైన ప్రాంతాల్లో దశలవారీగా మలాథియాన్ ఆయిల్ స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.

జనగాం

ఎఫ్ పీఓ ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సాహించాలి :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలి:-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా —————————————————————– వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రైతులకు అవగాహన కల్పించాలి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), సేంద్రీయ రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (భారత ప్రభుత్వ సంస్థ – APEDA) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎగుమతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (APEDA) భారత ప్రభుత్వ సంస్థ అని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి అవసరమైన లైసెన్సులు, నాణ్యత ప్రమాణాలు, దిగుమతిదారులు–ఎగుమతిదారుల మధ్య అనుసంధానం, సరఫరా గొలుసు (సప్లై చైన్) ఏర్పాటు వంటి అంశాల్లో APEDA కీలక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని వివరించారు. జిల్లాలో ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా చిట్టి ముత్యాలు బియ్యం ఎగుమతులకు అధిక డిమాండ్ (గిరాకీ) ఉందన్నారు. MTU–1010 పారాబాయిల్డ్ రైస్ రకానికి విదేశాల్లో మంచి మార్కెట్ ఉందని, తెలంగాణ నుంచి ఈ రకం బియ్యాన్ని 22 వేల మెట్రిక్ టన్నులు ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 44 వేల ఎకరాల్లో MTU–1010 రకం సాగు జరుగుతుండగా, అది జిల్లాలోని వరి సాగులో 26 శాతం వాటా కలిగి ఉందని చెప్పారు. ఈ రకం బియ్యానికి విదేశీ మార్కెట్లో సుమారు రూ.3,600 వరకు ధర లభిస్తోందని పేర్కొన్నారు. భారత్ కృషి నిర్యాత్ యోజన పథకం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే అవకాశాలను రైతులు, ఎఫ్‌పీఓలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో ఉన్న 22 ఎఫ్‌పీఓలు, రైతులు, ఎగుమతుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, APEDA ద్వారా లభించే సహాయ సహకారాలను ఉపయోగించుకుని అంతర్జాతీయ విపణిలో తమ ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించాలని సూచించారు. జిల్లాలోని రైతులు, ఎఫ్‌పీఓలకు ప్రత్యక్ష మార్కెట్ అవకాశాలు కల్పించేలా రాబోయే 30 రోజుల్లో కొనుగోలుదారులు – ఖరీదుదారుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఎఫ్‌పీఓ మేళాలను కూడా నిర్వహించి, రైతులను ఎగుమతి మార్కెట్లతో అనుసంధానం చేయాలన్నారు. చిట్టిముత్యాలు సువాసన బియ్యాన్ని ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం (PMFME)లోని ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP) జాబితాలో ఉన్న ప్రత్యేక ఉత్పత్తిగా అభివృద్ధి చేయాలన్నారు. స్వచ్ఛమైన విత్తనం, ప్రత్యేక మిల్లింగ్, ప్రత్యేక లాట్లు, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కల్తీ నివారణ, ముందస్తు కొనుగోలుదారుల ఒప్పందాలతో ప్రీమియం బ్రాండ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ పంట కోత దశలో ఉన్నందున యాసంగి 2026–27 నుంచి అవశేషాల నియంత్రిత క్లస్టర్‌ను ప్రారంభించాలన్నారు. జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), రైస్ మిల్లర్లు, ప్రాసెసర్లు DGFT పోర్టల్ ద్వారా APEDA e-RCMC నమోదు పొందాలని సూచించారు. ISO 22000/HACCP ధృవీకరణ, SFDA నమోదుకు ఎంపిక చేసే రైస్ మిల్లుల జాబితా సిద్ధం చేయాలన్నారు. యాసంగి 2026–27 కోసం అవశేషాల నియంత్రిత బియ్యం క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, పాల్గొనే FPO, ఎగుమతిదారుని గుర్తించాలన్నారు. అంతకుముందు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన అవకాశాలు, నాణ్యత ప్రమాణాలు, మార్కెటింగ్, APEDA అందించే సహాయం, ఎగుమతి ప్రక్రియపై ఈ అవగాహన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా *APEDA అసిస్టెంట్ మేనేజర్ సుకేష్* సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. అంబికా సోని, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, APEDA అసిస్టెంట్ మేనేజర్ సుకేష్, నాబార్డ్ డీడీఎం విజయ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రతిభ, కృషి సఖీలు, జిల్లాలోని ఎఫ్‌పీఓలు, ఎఫ్‌పీసీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ఆయుష్ వైద్య శిబిరం ప్రారంభం :డాక్టర్ వాణిశ్రీ DM&HO

జనగామ యూపీహెచ్సీలో ఆయుష్ వైద్య శిబిరం నిర్వహణ ——————————————————————– 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ పట్టణంలోని యూపీహెచ్సీ(UPHC)లో ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. వాణిశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో మొత్తం (520) మంది రోగులు పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. మమత, డా. సరిత, డా. ప్రియదర్శిని, డా. జునైద్, డీపీఎం కుమార్, డా. అనురాధ, ఇతర ఆయుష్ వైద్యులు, యూపీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.

జనగాం

జూనియర్ కళాశాలల్లో అకాడమిక్ ప్రమాణాల పెంపుకై ప్రత్యేక ద్రుష్టి సారించాలి :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జూనియర్ కళాశాలల్లో అకడమిక్ ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————————– *విద్యార్థులు, అధ్యాపకుల హాజరును FRS ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) ద్వారా ప్రవేశ, నిష్క్రమణ సమయాల్లో తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అకడమిక్ ఫ్రేమ్‌వర్క్‌, అసెస్‌మెంట్ టూల్‌ కిట్ లను కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం), కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం), మ్యాథ్స్(గణిత శాస్త్రం), బయాలజీ (జీవ శాస్త్రం), జూలజీ (జంతు శాస్త్రం), అకౌంటింగ్ సబ్జెక్టులకు సంబంధించిన అకడమిక్ ఫ్రేమ్‌వర్క్, అసెస్‌మెంట్ టూల్‌కిట్‌ లను అందించడం జరుగుతుందని తెలిపారు. వాటిని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందజేసి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ ‘ప్రణాళిక :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళిక:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————————- గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను సమర్థంగా అమలు చేయాలి ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ జలసిరి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి* వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల అమలుపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన వీబీజీ–రామ్‌జీ 125 రోజుల ఉపాధి పని గ్యారంటీ, ఎల్నినో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళిక, తెలంగాణ జలసిరి పనులపై బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట, జనగామ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు *వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ తయారీ, అమలు* శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో బావులు, బోర్‌ వెల్, ఇరిగేషన్ ఛానళ్లు, డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ల నిర్మాణం, స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, బోర్‌ వెల్ వాటర్ ఆటోమేషన్ సెన్సర్ల ఏర్పాటు వంటి పనులను చేపట్టవచ్చని తెలిపారు. అలాగే చెక్‌ డ్యామ్‌లు, రీఛార్జ్ పిట్లు, చెరువుల పునరుద్ధరణ, అండర్‌ గ్రౌండ్ డైక్స్ వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామీణ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు, క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్లు, ఫుట్ ఓవర్ పాత్‌ వేలు, పెవర్ బ్లాక్ ఫుట్‌పాత్‌లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, ల్యాబొరేటరీలు, కాంపౌండ్ వాల్లు, క్రీడా మైదానాల నిర్మాణం, మరమ్మతులు కూడా ఈ పథకం ద్వారా చేపట్టవచ్చని వివరించారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, వ్యక్తిగత, కమ్యూనిటీ సోక్‌ పిట్లు, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్ యూనిట్లు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ చాంబర్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్, రీసైక్లింగ్ ప్లాంట్లు, చెత్త సేకరణ పిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, బయో ఫర్టిలైజర్ స్టోరేజ్ యూనిట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ లైట్లు ఏర్పాటు వంటి పనులను కూడా చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖ, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులు గ్రామాల అవసరాలకు అనుగుణంగా సర్పంచులతో సమన్వయం చేసుకొని పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. కూలీల సమీకరణకు ప్రాధాన్యత ఇచ్చి గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయం, నీటి సంరక్షణ, ఉద్యానవనం, అటవీకరణ, గ్రామీణ రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టులు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రీసైక్లింగ్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ లైట్లు, తదితర అనేక అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీలు చేపట్టవచ్చని తెలిపారు. గ్రామాల అవసరాలను గుర్తించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పనులను ఎంపిక చేసుకోవాలని, కొత్త నిర్మాణాలతో పాటు ఇప్పటికే ఉన్న మౌలిక వసతులకు మరమ్మతులు, నిర్వహణ పనులను కూడా చేపట్టవచ్చని చెప్పారు. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా వీబీజీ–రామ్‌జీ పథకం కింద 125 రోజుల పనులను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. ఎల్‌నినో కారణంగా తలెత్తే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణ పనులు, చెరువుల పునరుద్ధరణ, చెక్‌ డ్యాంలు, రీచార్జ్ పిట్లు, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని కార్యాచరణ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. దీని కింద వెదురు, మ్యాంగ్రోవ్, మియావాకి, కొబ్బరి, రబ్బర్, బయో డ్రైనేజ్, బ్రూమ్, తదితర మొక్కల పెంపకాన్ని చేపట్టవచ్చని చెప్పారు. అదే విధంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై చేపట్టగల వివిధ పనులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించి, అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డీఆర్‌డీఓ భాస్కర్, అదనపు డీఆర్‌డీఓ సూరి, ఎఫ్‌ఆర్‌ఓ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీపీఓ వెంకట్‌ రెడ్డి, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, డీవీహెచ్‌ఓ మురళీధర్ రావు, ఈఈ పీఆర్ రవీందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట్ట, జనగామ మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు

ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణి శ్రీ మరియు జిల్లా ఔషధ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఘనపూర్ స్టేషన్ లోని ఆసుపత్రులు, క్లినిక్ లు మరియు మెడికల్ షాప్ లపై తనిఖీలు చెయ్యడం జరిగింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 06 మెడికల్ షాప్స్ షోకాజ్ నోటిసులు జారి చెయ్యడం జరిగింది. సాయి శ్రీ క్లినిక్ లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ కేంద్రం (ల్యాబ్) ను ముసివేయ్యడం జరిగింది, అనుమతి లేకుండా రాజా రాజేశ్వరి మెడికల్ షాప్ లో వెనుక భాగం లో నిర్వహిస్తున్న క్లినిక్ ను ముసివేయ్యడం జరిగింది. అదే విధంగా జగన్ కట్ల దావఖాన లో ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎక్స్ రే యంత్రం ను ముసివేయ్యడం జరిగింది. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణి శ్రీ , మరియు ఔషధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డా. రాజ్యలక్ష్మి , జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆలే బాలకిషన్ , భుపలపెల్లీ జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి .పి. పావన, వరంగల్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి U.ఉపేందర్ మరియు ఘనపూర్ స్టేషన్ వైద్యాధికారి డా. పి. శ్రీ వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జనగాం

బిజెపి జిల్లా కార్యాలయంలో వివిధ మోర్చా ల కు సంబందించి ముఖ్య నాయకులతో సమావేశం :బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో వివిధ మోర్చాలకు సంబంధించి సేల్స్ కు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భాజాపా పోరాటం చేస్తుందని విద్యార్థుల పక్షాన 40 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని మరియు రైతు సమస్యల కోసం అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులు 97 జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని 97 జీవో రద్దు చేసేంతవరకు భాజపా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుందని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిరుపేద మహిళలకు 2500 ఇవ్వాలని గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు రాజకీయ పార్టీల తోటి సంబంధం లేకుండా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువకులకు 4500 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలు నెరవేర్చే వరకు యువకులు, విద్యార్థులు రైతులు మహిళలు వారి పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు పోరాటాలు కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు విడుదల రమేష్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ల్లబోయిన హరీష్ సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శశిధర్ గుప్తా మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ముసుకే స్వప్న రమ పెద్ద జగదీష్ మోతె జనార్ధన్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

కంప్యూటర్ విద్య పరిశుభ్రత విద్యా ప్రమాణాల పై ప్రత్యేక ద్రుష్టి సారించాలి :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————————— జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అన్నారు. బుధవారం, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆకస్మికంగా సందర్శించి, విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌ (ఏఎక్స్ఎల్)ను ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కంప్యూటర్లను సరైన విధంగా వినియోగించేలా కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం 5వ తరగతి, ప్రీ-ప్రైమరీ, యూకేజీ, 2వ తరగతి, 3వ తరగతి గదులను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. “What is your name?”, “Father’s name?” అంటూ విద్యార్థులను ప్రశ్నించి, ఆయా సబ్జెక్టుల అంశాలపై విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను పర్యవేక్షించిన *కలెక్టర్*, పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అదే విధంగా ఉన్నత పాఠశాల తరగతి గదుల సంఖ్య, విద్యార్థులు ఎంత మంది అనే వివరాలపై ఆరా తీశారు. పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారని *ఎంఈవో వెంకట్, కలెక్టర్‌కు* వివరించారు. బయట నిర్వహిస్తున్న రెండు తరగతి గదులను పాఠశాల భవనంలోని గదుల్లోకి మార్చాలని *పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమృతకు, కలెక్టర్* సూచించారు. మధ్యాహ్న భోజనశాలను పరిశీలించిన *కలెక్టర్*, కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న విధానాన్ని గమనించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్‌పై మాత్రమే వంట చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్నారు. విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ పరిశీలనలో ఎంఈఓ వెంకట్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమృత, ఇతర సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ప్రజా వాణి లో ద్రుష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మంచుప్పుల గ్రామానికి చెందిన దృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ————————————————————————– ప్రజావాణిలో విజ్ఞప్తి.. ఓ కుటుంబానికి కొత్త ఆశను నింపింది రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి కలెక్టర్ ఉత్తర్వులు *ప్రొసీడింగ్స్ కాపీ అందజేసి, వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు* వర్షం పడితే ఇంట్లోకి నీరు వస్తుంది.. పాత ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం.. అయినా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సొంత ఇంటి కల నెరవేరని పరిస్థితి. ఇలాంటి కష్టాల్లో ఉన్న మంచుప్పుల గ్రామానికి చెందిన *దృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళ మేకల పద్మ* తన సమస్యను ప్రజావాణి ద్వారా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* దృష్టికి తీసుకువచ్చారు. *వివరాల్లోకి వెళ్తే..* జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, మంచుప్పుల గ్రామానికి చెందిన *మేకల పద్మ* తన తండ్రి, తమ్ముడితో కలిసి నివసిస్తున్నారు. ప్రస్తుతం వారు పాత కచ్చా ఇంటిలో జీవనం సాగిస్తున్నారు. వర్షాలు కురిసిన సమయంలో ఇంటి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుండటంతో, సొంత స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరుతూ ప్రజావాణిలో *జిల్లా కలెక్టర్‌కు* దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన *కలెక్టర్*, సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించారు. విచారణలో *పద్మ* ఇందిరమ్మ ఇంటికి అర్హురాలిగా నిర్ధారణ కావడంతో, ఆమెకు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో కొత్త ఇంటి నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్‌లో *మేకల పద్మకు* ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. లబ్ధిదారురాలి ఇంటి నిర్మాణాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభించాలని పాలకుర్తి ఎంపీడీఓను ఆదేశించారు. ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, ప్రభుత్వం నిర్దేశించిన దశల వారీ విధానంలో నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో *మేకల పద్మ, జిల్లా కలెక్టర్ గారికి* కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజావాణిలో తన సమస్యను వినిపించిన వెంటనే స్పందించి, సొంత ఇంటి కలను నిజం చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజావాణి కేవలం ఫిర్యాదులు స్వీకరించే వేదిక మాత్రమే కాదు.. అర్హులైన ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పరిష్కార వేదికగా నిలుస్తుందనేందుకు ఇదే నిదర్శనం.

జనగాం

జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రాహ్మత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి :కడియం శ్రీహరి మాజీ ఉప ముఖ్యమంత్రి

జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి:-కడియం శ్రీహరి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు ——————————————————————- కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం *శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి* ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి* జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని *ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి* అధికారులను ఆదేశించారు. మంగళవారం, జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలంలోని జీడికల్ గ్రామంలో గల శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో 2026 కార్తీక మాస బ్రహ్మోత్సవాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *ఎమ్మెల్యే కడియం శ్రీహరి* మాట్లాడుతూ.. జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి గొప్ప చరిత్ర, ప్రాశస్త్యం ఉందని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రెండు నెలల ముందుగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 24 నుంచి 29 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయం చుట్టూ కనీసం ఒక కిలోమీటరు పరిధిలో పరిశుభ్రతను నిరంతరం నిర్వహించేలా సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గతసారి సుమారు 25 వేల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి 40 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధ తాగునీరు, ముడి నీటి సరఫరా చేయాలన్నారు. అలాగే శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లను తగిన నీటి, విద్యుత్ సరఫరాతో నిర్మించాలని సూచించారు. జనగామ–జీడికల్ రహదారి పనులను పూర్తి చేయాలని, ఆలయం ఎదురుగా ఉన్న ఫోర్‌లైన్ రోడ్డులో మీడియన్ అభివృద్ధి, హార్టికల్చర్ శాఖ ద్వారా పచ్చదనం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో ఆలయం నుంచి వెళ్లే మూడు కిలోమీటర్ల రహదారి పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ఆలయ కళ్యాణ మండపం సమీపంలోని భూమిలో పచ్చదనం, చిన్నపాటి పార్కును అభివృద్ధి చేయాలని, ఆలయ పరిసరాల్లో లెవలింగ్, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించి, జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ఖ్యాతిని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా, ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈఈ పీఆర్ ద్వారా సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, తదితర పనుల అంచనాలను సిద్ధం చేయాలన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో లైటింగ్, డెకరేషన్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలన్నారు. రూట్ మ్యాప్‌కు క్యూఆర్ కోడ్ రూపొందించి జిల్లా, పోలీసు వెబ్‌సైట్లలో ఉంచాలన్నారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. అనంతరం *డీసీపీ* మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం సమగ్ర పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. బందోబస్తును పటిష్ఠంగా నిర్వహించి, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించనున్నట్లు తెలిపారు. *సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ* అనంతరం (30) మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను *ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అందజేశారు. అంతకుముందు *ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్* లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంగళవాయిద్యాల నడుమ, వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని వారికి అందించారు. *జాతర ప్రధాన తేదీలు* * జాతర ప్రారంభం: 23-11-2026 (సోమవారం) * కార్తీక పౌర్ణమి: 24-11-2026 (మంగళవారం) * ఎదురుకోళ్లు: 27-11-2026 (శుక్రవారం) * కళ్యాణం: 28-11-2026 (శనివారం) * రథోత్సవం: 29-11-2026 (ఆదివారం) * జాతర ముగింపు: 05-12-2026 (శనివారం) ఈ సమీక్ష సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎంపీడీఓ శివశంకర్ రెడ్డి, తహసీల్దార్ ఆండాలు, ఆలయ కమిటీ ఛైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, సర్పంచ్, డీఎంహెచ్‌వో వాణిశ్రీ, ఎస్‌ఈ ఎన్‌పీడీసీఎల్ సంపత్ రెడ్డి, మిషన్ భగీరథ ఇన్‌ట్రా ఈఈ శ్రీకాంత్, ఈఈ పీఆర్ రవీందర్, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.