ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఇంటింటికి వెళ్లి అందించిన జ్యోతుల నవీన్
*గండేపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ – 14 మందికి రూ. ఆరు లక్షల 30 వేల రూపాయల చెక్కులు – ఇంటింటికి వెళ్లి పరామర్శించిన జ్యోతుల నవీన్* *కాకినాడ , గండేపల్లి, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 27:* గండేపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 14 మందికి రూ. 6 లక్షల 30 వేల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. నీలాద్రి రావు పేటలో 4 మందికి, తాళ్లూరులో ఇద్దరికి, మల్లేపల్లిలో ముగ్గురికి, యల్లమల్లిలో ఒకరికి, నాయకంపల్లిలో ఇద్దరికి, యర్రంపాలెంలో ఇద్దరికి రూ. 6 లక్షల 30 వేల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. గురువారం ఇంటింటికి వెళ్లి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 14 మంది ఇళ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కులం, మతం, పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారకుండా సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, జీను మణి బాబు, కందుల చిట్టిబాబు, కుంచె రాజా, జాస్తి వసంత్, అడబాల రామాంజనేయులు, బుర్రి సత్తిబాబు, కుంచే రామకృష్ణ, ఆయా గ్రామాల కూటమి నాయకులు పాల్గొన్నారు.




