Wednesday, 23 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

విద్యా హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన

తిమ్మరాజుపేట (ఎస్.రాయవరం), ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): తిమ్మరాజుపేట KGBV పాఠశాలలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి ఎన్.సూర్యలక్ష్మి మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్య అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. లింగ వివక్షకు తావులేకుండా నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పిల్లల హక్కులకు భంగం కలిగితే చైల్డ్‌లైన్ 1098, మహిళలు, బాలికల సమస్యలకు 181 ఉచిత నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అనకాపల్లి

వరి నారు చివర్లు తొలగించండి.. పంట బీమా చేసుకోండి!

యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక, పద్మరాజుపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు రైతులకు పలు సూచనలు చేశారు. వరి నాట్ల సమయంలో నారు చివర్లు చిదిమేయడం ద్వారా కాండం తొలిచే పురుగు, తెల్లకంకి ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని, గడువు ఈ నెలాఖరు వరకు ఉన్నందున వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోవాలని, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు.

అనకాపల్లి

70 ఏళ్ల జర్నలిస్టుల సేవకు ఘన నివాళి.. యలమంచిలిలో ఏపీయుడబ్ల్యూజే వేడుకలు

యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీయుడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సమాజ సేవలో కీలకంగా పనిచేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించి పారితోషికాలు అందించారు. ఏపీయుడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ మెంబర్ గుమ్మెళ్ల గోవిందరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుద్ర సింహాచలం మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. 70 ఏళ్లుగా ఏపీయుడబ్ల్యూజే సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆడారి గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

అనకాపల్లి

బాధితులకు న్యాయమే పోలీసుల అసలైన కొలమానం.. 64 ఫిర్యాదులపై ఎస్పీ తుహిన్ సిన్హా స్పందన

అనకాపల్లి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసు వ్యవస్థకు అసలైన కొలమానమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 64 ఫిర్యాదులను స్వీకరించారు. భూ, ఆస్తి వివాదాలు, ఆర్థిక మోసాలు, కుటుంబ సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. ప్రతి ఫిర్యాదుపై వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. మహిళల రక్షణ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

రేగుపాలం–ఎలమంచిలి రహదారికి మరమ్మతుల శ్రీకారం

యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): రేగుపాలం ఎన్‌హెచ్‌–5 నుంచి ఎలమంచిలి కోటారి వారి పెట్రోల్ బంక్ వరకు గుంతలతో అధ్వానంగా మారిన రహదారికి ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్యాచ్‌వర్క్ ద్వారా గుంతలను పూడ్చి తారు వేస్తున్నారు. గతంలో ఈ రహదారిపై గుంతల కారణంగా పలుమార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించింది. సమస్యను ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు పనులు చేపట్టారు. ఏఈ సత్యవాణి పనులను పర్యవేక్షించగా, లైన్ కొత్తూరు పంచాయతీ జనసేన నాయకులు లాలం సోమునాయుడు, ఇతర జనసేన, కూటమి నాయకులు పనులను పరిశీలించారు. రహదారి మరమ్మతులకు చొరవ చూపిన ఎమ్మెల్యే, అధికారులకు, నాయకులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి

ఎలమంచిలిలో ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ మహాసభలు.. కార్మికుల సమస్యలపై గళం

ఎలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ మహాసభలకు 28 జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. మహాసభల్లో నూతన కమిటీ ఎన్నికతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ కాసుబాబు తెలిపారు. కార్మికులపై అధిక జరిమానాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ చార్జీలు తగ్గించాలని, ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న జీవీఎంసీ గాంధీ పార్కులో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనకాపల్లి

యలమంచిలిలో టైక్వాండో క్రీడాకారుల సత్తా.. 38 బంగారు పతకాలతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

యలమంచిలి, ఆగస్టు 17 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి జిల్లా టైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం యలమంచిలి కొత్తపేట రామాలయం పార్కులో ఉత్సాహంగా జరిగాయి. జిల్లాలోని పలు టైక్వాండో క్లబ్బుల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో 38 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో 13 మంది బాలికలు, 25 మంది బాలురు ఉన్నారు. అలాగే 14 మంది రజత పతకాలు, 8 మంది కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతక విజేతలు ఈ నెల 21న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. అతిథిగా హాజరైన ఏజీపీ రాజాన గోవిందరావు మాట్లాడుతూ టైక్వాండో క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా టైక్వాండో కార్యదర్శి నగరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాయవరపు సుధాకర్, యలమంచిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారపరెడ్డి వెంకటరావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎల్వీ రామకృష్ణ, స్పోర్ట్స్ కార్యదర్శి వేముశెట్టి కృష్ణ, పోలిశెట్టి వీర ప్రజానాయక్, కూనిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

నర్సీపట్నం మండలంలో 6 ఏఐ పోస్టులు.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 16 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): నర్సీపట్నం మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (AI) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారి చి. తలుపులు తెలిపారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ హిందీ–4, బయాలజీ–1, సోషల్ స్టడీస్–1 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ హైస్కూల్, జడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ నర్సీపట్నం, జడ్పీహెచ్‌ఎస్ పి.బి.పల్లి, జడ్పీహెచ్‌ఎస్ మెయిన్ నర్సీపట్నం, పీబీఎం జడ్పీహెచ్‌ఎస్ వేములపూడి పాఠశాలల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 సాయంత్రం 5 గంటలలోపు నర్సీపట్నం MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు అటెస్టెడ్ సర్టిఫికెట్లు, విద్యార్హతలు, ప్రొఫెషనల్ అర్హతలు, TET, రెసిడెన్స్ తదితర ధ్రువపత్రాలను రెండు సెట్లలో అందజేయాలని సూచించారు. నర్సీపట్నం మండలంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని, DSC ఎంపిక నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయని MEO తెలిపారు. ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు.

అనకాపల్లి

పున్నమి న్యూస్ కథనానికి స్పందన.. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ క్లియరెన్స్..!

యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై పున్నమి న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు, కూటమి నాయకులు స్పందించారు. కాలనీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, వెంటనే చర్యలు చేపట్టారు. డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్త, మురుగును క్రేన్‌ మెషిన్‌ సహాయంతో తొలగించే పనులను ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి గిరి ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అన్నం బాబ్జి, కాండ్రకోట చిరంజీవి, శెన్నాంశెట్టి శ్రీను, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, భజంత్రీలు శ్రీను కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. మేము ప్రజలకు దగ్గరలోనే ఉంటాం.. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి.. పరిష్కారం కోసం కృషి చేస్తాం” అని తెలిపారు. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలను కూడా పరిశీలించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పందించేలా చేసిన పున్నమి న్యూస్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో గ్రామసభ.. సమస్యల పరిష్కారంపై చర్చ….!

యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో గ్రామంలోని పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామ ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగింది. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతుల సమస్యలను గ్రామస్థులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. ఈ గ్రామసభలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొని గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.