మేకల పెంపకందారుల సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 22, 23, 24 తేదీల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలో నిర్వహిస్తున్నట్లు GMPS వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ తెలిపారు. మహాసభలను జయప్రదం చేయాలని గొల్ల కురుమలు, గొర్రెల కాపరులకు ఆయన పిలుపునిచ్చారు.*
*GMPS సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం, ముగ్గంపురం గ్రామాల్లో GMPS జెండాలను ఘనంగా ఆవిష్కరించారు.*
అనంతరం జరిగిన సమావేశంలో పరికి మధుకర్ మాట్లాడుతూ.. సంఘం ఏర్పడినప్పటి నుంచి గొర్రెలు, మేకల పెంపకందారుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతోందన్నారు.
559, 1016 జీవోల సాధన ద్వారా తుమ్మ చెట్లు, పంచరాయి, పోరంబోకు, కాలువ గట్లు, చెరువు శిఖరాలు తదితర ప్రభుత్వ భూముల్లో గొర్రెలు, మేకలను మేపుకునే హక్కు కోసం సంఘం పోరాడిందన్నారు. గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల మందులు, వ్యాక్సిన్లు అందేలా సంఘం పోరాటాల ఫలితంగా సాధించామని తెలిపారు.
ప్రధాన డిమాండ్లు
50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు పింఛన్ ఇవ్వాలి.
ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
ప్రతి గ్రామంలోని సొసైటీలకు మేత భూముల కోసం 20 ఎకరాల భూమి కేటాయించాలి.
ప్రతి గ్రామంలో పశు వైద్యశాల ఏర్పాటు చేయాలి.
ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల వృత్తి సమస్యలను పరిష్కరించాలి.
ఈ సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి రాష్ట్ర 4వ మహాసభలు కీలకంగా ఉపయోగపడతాయని పరికి మధుకర్ అన్నారు. గొల్ల కురుమలు, గొర్రెల కాపరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కుండ లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు జక్కుల మల్లేష్, జక్క రవి, మండల అధ్యక్ష కార్యదర్శులు రాజులపాటి సూరయ్య, దాడి రాజు, మండల కోశాధికారి భూస రాజు, నాన్నబోయిన సుమన్, పొగాకు శీను, ఉపాధ్యక్షుడు పైడిపల్లి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.



