Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

జపాన్‌ ‌జీవనశైలికి జై కొట్టాల్సిందే!

జపాన్‌ ‌జీవనశైలికి జై కొట్టాల్సిందే! ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవత్స రాల వ్యక్తి మరణించాడు. ఆయన జపాన్‌ ‌పౌరుడు. ఆయన తన తొంభై సంవత్సరాల వయసు వరకు పని చేస్తూనే ఉన్నాడు. ఆయనే కాదు, జపాన్‌ ‌పౌరులు ఎక్కువ కాలం జీవించడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక ఇక్కడి మహి ళలయితే గత పాతిక సంవత్స రాలుగా ఇతర దేశాల మహిళల కంటే అదనపు సగటు జీవిత కాలంతో జీవితాన్ని ఎంజాయ్‌ ‌చేస్తు న్నారు. 2010లో వీరి సగటు జీవిత కాలం 86.3 సంవత్సరా లుగా ఉంది. 2011లో ఒక్కసారి మాత్రమే 85.9కి తగ్గి హాంకాంగ్‌ ‌కి మొదటి స్థానం ఇచ్చి రెండో స్థానానికి వెళ్లారు ఈ మహిళలు. ఇందుకు కారణం 2011 మార్చిలో వచ్చిన ‌తుఫాన్‌ ఇక ఇక్కడి మగవారి సగటు జీవిత కాలం 79.4 సంవత్సరాలు. ఇది మహి ళల కంటే తక్కువే అయినా ఇతర దేశాల మగవారితో పోలిస్తే ఇది ఎక్కువే. ప్రస్తుతం జపాన్‌ ‌జీవన కాలం విషయంలో 84.46 సగ టుతో ప్రపంచంలో మూడో స్థా నంలో ఉంది. దాని ముందు మొనాకో, మకావ్‌ ఉన్నాయి. ఈ విషయంలో 67.80 సగటు జీవిత కాలంతో ప్రపంచదేశాల్లో 163వ స్థానంలో ఉన్న మనం, జపాన్‌ ‌పని రాక్షసులు అంత ఎక్కువకాలం ఎలా జీవిస్తున్నారో తెలుసుకుని తీరా ల్సిందే…. వీరు తమదైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చేపలు, వరి అన్నం, ఉడికించిన కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. వైద్య సదు పాయం తేలిగ్గా అందుబాటులో ఉం టుంది. ఇవన్నీ కాకుండా వృద్ధుల పట్ల ఇక్కడ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిసి వారి జీవితకాలాన్ని పెంచు తున్నాయి. ముఖ్యంగా తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. సోయాబీన్స్‌తో తయారయిన తోఫు అనే కొలెస్ట్రాల్‌ ‌లేని పెరుగుని వాడతారు. ఇందులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వేల సంవత్సరాలుగా చైనావారు ఔషధాల్లో వాడుతున్న షీటేక్‌ ‌పుట్ట గొడుగులను జపాన్‌ ‌వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ ఉంటుంది. ఉప్పు ఎక్కువ వాడాల్సిన వంట కాలు, చేపల వేపుడు, నిలవ పచ్చళ్లు, సోయాసాస్‌ ‌లాంటివాటిని బాగానే తీసు కుంటారు. అక్కడి మగవారు స్మోకింగ్‌ ‌కూడా ఎక్కువే చేస్తారు. ప్రతి ముగ్గురిలో ఒకరు పొగతాగుతారు. ఆల్కహాల్‌ ‌సంబం ధింత పానీయాలు సైతం ఎక్కువే తీసు కుంటారు. అయితే వారిలో ఒబేసిటీ సమస్య అనేది కనిపించదు. 80శాతం పొట్టనిండగానే తినడం ఆపేయమనే ఒక జపనీస్‌ ఆరోగ్య సూక్తిని వారు బాగా పాటిస్తారు. రెండేళ్ల క్రితం టోక్యో ప్రొఫెసర్‌ ఒకరు జపాన్‌ ‌ప్రజల జీవితకాలం ‌పై అధ్యయనం చేశారు. ఆయన వెల్లడించిన విషయాల్లో ముఖ్యమైనది జపాన్‌ ‌ప్రజలు శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మనస్తత్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల పై మంచి ప్రభావాన్ని చూపు తోంది. విద్య, సంస్కృతి, పర్యావరణ పరి రక్షణ, కాలుష్యనివారణ వీటన్నింటిపై శుభ్రత పట్ల వారికున్న శ్రద్ధ ప్రభావం చూపుతోందని ఆయన అధ్యయనంలో తేలింది. అక్కడ షింటో అనే సంప్ర దాయం ఉంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుచిగా ఉండాలని జపాన్‌వారు నమ్ముతారు. వీరిలో ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిరంతరం జరుగుతుంటాయి. పాఠశాల ల్లోనూ, పనిప్రదేశాల్లోనూ ఇలాంటి సదు పాయాలు ఉంటాయి.ఇవి కాకుండా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు సైతం ఈ సౌకర్యాలు కల్పిస్తాయి. ఇక్కడి ప్రభుత్వాలు ఆర్థిక పెరుగుదలతో పాటు ప్రజల ఆహార ప్రమాణాన్ని పెంచడంలో చర్యలు తీసుకుంటాయి. ఇవన్నీ కాకుండా జపాన్‌కి తైవాన్‌కి మధ్య ఉన్న ద్వీప ప్రాంతాల్లో నివసిస్తున్న వారు మరింతఎక్కువ కాలం జీవిస్తున్న ట్టుగా పరిశోధకులు తేల్చారు. వీరిలో గుండె జబ్బులు, క్యాన్సర్‌లు తక్కువ ఉన్నాయి. వీరిలో తరతరాలుగా వస్తున్న జన్యు లక్షణాలు పలురకాల వ్యాధులను రాకుండా నివారిస్తున్నట్టుగా పరిశోధ కులు కనుగొన్నారు. మొత్తానికి చురుకైన జీవన శైలి, ఆరోగ్యకరమైన తాజా ఆహారం, పరిశుభ్రత, కడుపునిండా తినకపోవడం ఇవే జపాన్‌ ‌ప్రజల ఆరోగ్యరహస్యాలుగా తెలుస్తోంది.

Featured తెలంగాణ బిజినెస్

మన ఉద్యోగం ప్రమాదంలో పడింది అని చెప్పడానికి 10 సంకేతాలు

మన ఉద్యోగం ప్రమాదంలో పడింది అని చెప్పడానికి 10 సంకేతాలు (పున్నమి ప్రతినిధి) : ఛా ఛా ఛా! ఎలా అయిపోయింది నా జీవితం!!? ఒక్క సంవత్సరంలో! ఎలాంటి ఆర్టికల్‌ ‌రాయాలని మొదలు పెట్టినా, ‘‘అసలే ఈ కరోనా కష్టకాలంలో’’ అని మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఆర్టికల్‌ ‌కూడా! ‘‘అసలే ఈ కరోనా కష్టకాలంలో’’ ఎన్నో ఇండస్ట్రీలు, పారిశ్రామిక రంగాలు, ఐటీ నుంచి, తయారీ రంగం, నిర్మాణ రంగం మొదలైన వాటిలో పని మందగించి, లాభాలు తగ్గి, ఉద్యోగాల కోత ప్రారంభం అయింది. దీనికి ఎవరూ అతీతం కాదు! అయితే, వేటు మన మీద పడక ముందే, ఆ సంకేతాలు ఆ ‘కళలు’ మా తెలంగాణా భాషలో చెప్పాలి అంటే, ఆ ‘శకలు’ ఎలా ఉంటాయో ఈ వారం ఆర్టికల్‌లో చూద్దాం. వేటు పడక ముందే, మనం పెట్టే బేడా సర్ధుకుని మరో అవకాశం కోసం ప్రయత్నించడం కోసం. కంపెనీ శకలు / పోయే కాలం వచ్చిన కళలు : (1) సడన్‌గా బాసుల కఠినమైన భాష ఇంక్రిమెంటులు ఉం డవు. రివ్యూలు కర్కశంగా ఉంటాయి. బెదిరింపుల భాష ! ‘మరొక్క సారి ఇలాంటి తప్పు చేశావో’ భాష ! వారి పై అధికారులు వాడమన్న భాష. (2) మెర్జర్‌ : ‌మీ కంపెనీని ఇంకొక కంపెనీ కొనుక్కోవడం. ఇలా అయితే, కనీసం 40 శాతం మంది ఉద్యోగాలు పోతాయి. కానీ, మీ కంపెనీ, మరొక కంపెనీని కొనేస్తే, మీరు సేఫ్‌! ‌మీకు ఏమీ కాదు! (3) హఠాత్తుగా మానవ వనరుల శాఖ (హెచ్చార్‌)‌లో కొత్త వారిని, మరీ సీనియర్‌ ‌పొజిషన్‌లో (అనగా, జనరల్‌ ‌మేనేజర్‌, ‌వైస్‌ ‌ప్రెసిడెంటు) తీసుకోవడం. కంపెనీ నష్టాలలో ఉన్నా! (4) హెచ్చార్‌లో కొత్త ముఖాలు కనబడితే, మన ఉద్యోగానికి గండమే ! మేకను నరకాలంటేనే కదా, కసాయి వారిని పిలుస్తారు? (5) హెచ్చార్‌లో ఎక్కువ జూనియర్‌లని తీసుకుంటే, కంపెనీ ఎక్కువ మంది కొత్త వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అని అర్ధం. మొదటి రౌండు ఇంటర్‌వ్యూలు, స్క్రీనింగ్‌ ‌కోసం వీరిని తీసుకుంటారు. (6) కానీ, కంపెనీ సంక్షోభంలో ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన హెచ్చార్‌లని నియమించుకుంటే, అది నిలువునా నరకడానికే అని భావము. కత్తి మన మెడ మీద పడక ముందే మనం బయటి దిక్కు చూడడం మంచిది. (7) కంపెనీలు కొత్త వారిని తీసుకోవడం (ఏ పొజిషన్‌లో నయినా) పూర్తిగా బంద్‌ ‌పెట్టినప్పుడు. ఒక 2 సంవత్సరాలు ఒక్క కొత్త పురుగు కూడా కంపెనీలోకి రాలేదు ( బయటికి పొయ్యే వారు పోతున్నారు కానీ!), అంటే, మనకి గండం ఉంది అనే! (8) ఎప్పుడూ లిబరల్‌గా ఉండే కంపెనీ వారు, ఖర్చుల మీద నియంత్రణ పాటించాలి అని సర్‌క్యులర్‌లు పంపినప్పుడు ! పెన్ను లు, జిరాక్సులు, పేపర్‌లు. కంపెనీ పొదుపు మంత్రాలు పఠించినప్పుడు. ప్రయాణించే సేల్స్ ‌వారికి సెకండ్‌ ఏసీ కోసేసి స్లీపర్‌లో వెళ్ళాలి అనడం, తక్కువ బడ్జెట్‌ ‌హోటల్‌లో ఉండమని చెప్పడం. (9) ఆర్ధిక పరమైన సంకేతాలు : జీతాలు రావడం ఆలస్యం కావడం. బిజినెస్‌ ‌ట్రావెల్‌ ‌చేసిన వారి డబ్బులు రిఇంబర్స్ ‌కావడంలో ఆలస్యం. మీ కంపెనీకి సరుకు అమ్మిన వారికి చెల్లింపులు లేట్‌ ‌కావడం వగైరా.. (10) ‘‘కొంతమందిని తీసేస్తారట!’’ అంటు రూమర్‌లు వ్యాపింప జేయడం. వాటిని కంపెనీ ఖండించక పోవడం. మౌనం పాటించడం. ఏదైనా ఒక్క సంకేతం ఉంటే భయపడే అవసరం లేదు కానీ, 3 లేక 4 సంకేతాలు కలిపి ఒక మూడు నెలల పాటు కనిపిస్తే, ప్రమాద సంకేతాలు అని అర్ధం. మరో ఉద్యోగం కోసం బయటి చూపులు చూడడం బెటర్‌, ‌మన ప్రస్తుత ఉద్యోగం సిన్సియర్‌గా చేస్తూనే ! జీతానికి న్యాయం చెయ్యాలి కదా?

Featured ఆంధ్రప్రదేశ్

అనంతసాగరం మండలం: *లింగంగుంట* గ్రామంలో *డాllవై.ఎస్.ఆర్ పొలంబడి* కార్యక్రమాన్ని *అగ్రికల్చర్ అసిస్టెంట్ వడ్లపల్లి నాగేంద్ర* ఏర్పాటు చేయడం జరిగింది. పరిసరాల విశ్లేషణలో భాగంగా గింజ గట్టిపడే దశలో కేళీలు ఉన్నాయేమో గమనించి వాటిని పెరికించి వేయాలని, *వెన్ను దశలో తాలు గింజలు ఎన్ని వున్నాయో లెక్కించి దిగుబడి అంచనా ఎలా వేయాలో తెలియజేయడం జరిగింది.* రైతులు పండించే పంటలపై వారికి అవగాహనా కల్పిస్తూ, వారికీ తెలియని విషయాలు తెలియజేస్తూ, *పొలంబడి రైతులకు క్విజ్ పోటీలను* పెట్టి రైతులకు మరింత జ్ఞానాన్ని పెంపొందించడం జరిగింది. ఈకార్యక్రమంలో.. పొలంబడి రైతులు మరియు *హరీష్ ,హాసేన్ సౌజన్య, ప్రసన్న వెంకటేష్ వాలెంటీర్స్* పాల్గొనడం జరిగింది.

Featured ఆంధ్రప్రదేశ్ పిల్లలకు

పిల్లలకు ఏం చెబుతున్నాం? ఏం చెప్పాలి?

(పున్నమి ప్రతినిధి) : సీనియర్లు ర్యాంగింగ్‌ ‌చేశారని, అవమానించారని, ప్రిన్సిపాల్‌, ‌వార్డెన్లు, తల్లిదండ్రులు తిట్టారని, పరీక్ష పాస్‌ ‌కాలేదని, ప్రేమలో గెలవలేదని, పాఠాలు అర్థం కావడం లేదని, నచ్చిన చదువు చదవలేకపోతున్నామని?.ఇంకా ఎన్నో కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతీ యువకులను చూసినపుడు?అరె అలా చేయ కుండా ఉండాల్సింది.. ఇంత విశాలమైన ప్రపంచంలో వారికి జీవితం పట్ల పిడికెడు నమ్మకాన్ని ఇచ్చే వారే దొరకలేదా?గుప్పెడు ధైర్యాన్ని అందించేవారే కరువ య్యారా అనే బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆవేదన కలుగుతుంది. ఏదిఏమైనా ఇప్పటి తల్లిదండ్రుల ఒక పెద్ద బాధ్యత ఉంది?తమ పిల్లలు ఇత రుల మనసులను గాయ పరచ కుండా, తాము గాయపడ కుండా ఉండేలా వారికి తర్ఫీదు ఇవ్వాల్సి ఉంది? మరి అది సాధ్య మేనా?? నిజానికి ఒక పాతిక ముప్పయి ఏళ్ల క్రితం ఉన్నంత తీవ్రంగా జీవన కష్టాలు, పేదరికం బాధలు ఇప్పుడు లేవు. నాటి యువతరం అనేక కష్ట నష్టాలను భరించి ఇప్పడు ఆర్థికంగా నిలదొక్కుకున్న మధ్య తరగతి కేటగి రీగా ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. వీరి పిల్లలే నేటి యువతరంగా ఘనమైన విజయాలు సాధించి చూపుతున్నారు. ఊహిం చని అవకాశాలను అందిపుచ్చుకుం టున్నారు. రెండుపదుల వయసు దాటితే చాలు కెరీర్‌ అం‌టూ పరుగులు పెడుతున్నారు. పాతికేళ్లు వచ్చేసరికే తామెంటో నిరూ పిస్తున్నారు?ఇదంతా నాణేనికి ఒక వైపు. వీరిలోంచే అతి చిన్న కారణా లతోనే ప్రాణాలు తీసుకునే వారూ తయారవుతున్నారు. వీరిలోనే లక్షలు ఖర్చుపెట్టి చది వినా, అది జీవితానికి పనికొస్తుందో లేదో తెలియక సతమతమవుతున్న వారు ఉంటున్నారు, ఏ చిన్న అవమానం ఎదురైనా, ఏ విమర్శ వచ్చినా భయకంపితులై జీవితం నుండి పారిపోయే వారు ఉంటున్నారు. ఇంటికి ఒక్కరుగా లేదా ఇద్దరు పిల్లల్లో ఒకరుగా పుట్టి అల్లారుముద్దుగా పెరిగిన నేటి యువతరానికి, ఇంతకుముందు తరాలకంటే బతుకు భయం, ఒత్తిడి ఎక్కువ ఉంటున్నాయి. ఎలాగొలా బతకొచ్చులే అనే ధీమా వారిలో ఉండడం లేదు. ఇంటికి ఒక్క కొడుకు ఉంటాడు?ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఆ తల్లిదండ్రుల కలల్ని నిజం చేసి తీరాల్సిందే. మరొక ఆప్షన్‌ ‌లేదు. అలాగే ఇంటికి ఒక్క కూతురు ఉంటుంది. ఎలాగైనా ఆమె ఒక కోటీశ్వరుడి ఇంటికి కోడలిగా వెళ్లాల్సిందే. పిల్లలకు ఏ చిన్న లోటూ రాకుండా పెంచడమే ఇప్పటి తల్లిదండ్రుల ఏకైక ధ్యేయం. జీవితంలో లోటు?.జీవితంలో అన్నీ ఉండటం?రెండింటిలో ఏది సహజంగా కనబడుతోంది. మొదటిదే కదా?కానీ మనం ఆ సహజత్వాన్ని వదిలేసి, అత్యంత అసహజమైన రెండవదాని వెంటే పడుతున్నాం. నిజానికి ఇప్పటి పిల్లలకు మనం ఒక అబద్దపు ప్రపంచాన్ని చూపిస్తున్నాం. చిన్నతనం నుండీ మనం పెంచే విధానం అలాగే ఉంటున్నది. పిల్లలు అడిగినవన్నీ వారి చేతికి అందుతాయి. అందరూ వారిని ప్రేమిస్తారు, అందరూ అభిమానిస్తారు, జీవితం అంటే ఆనందాల పూల బాట అనే భ్రమ కల్పిస్తున్నాం. దాంతో వారు ఆత్మవిశ్వాసంతోనే పెరుగుతున్నారు. అయితే అది నిజమైన ఆత్మవిశ్వాసమా, కాదా అనేది వారికంటూ వ్యక్తిగతంగా సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయినప్పుడే తెలుస్తుంది. నిజానికి ఆత్మవిశ్వాసమంటే, పదిమందిలో ధైర్యంగా మాట్లాడడం, ముందుకు వెళ్లడం, గెలవడం?ఇవే అన్నట్టుగా మనం చెబుతున్నాం. కానీ అన్నీ ఉన్నపుడు, అంతా బాగున్నపుడు నాకన్నీ ఉన్నాయి? అనే ధీమాతో ఉండటం, ఆవిధంగా ధైర్యంగా బతకడం మాత్రమే ఆత్మవిశ్వాసం కాదు? ఏవి లేక పోయినా ధీమాగా ఉండగలను అనే ధైర్యమే ఆత్మవిశ్వాసం. పదిమంది పొగిడినపుడు కాలర్‌ ఎగరేయడం కాదు, పదిమంది విమర్శించినపుడు, తన పక్కన ఒక్కరు కూడా నిలబడనపుడు కూడా ధైర్యంగా ఉండడమే ఆత్మ విశ్వాసం అని ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పడం లేదు. ఎందుకంటే తమ పిల్లలకు జీవితంలో అన్నీ ఇచ్చేయాలనే తపన తప్ప, వారికి లేమి, అవమానం, విమర్శలు, సమాజంలోని కుటిలత్వం ఇవన్నీ సహజమని, వాటితో పాటు మనం బతకాలని నేటి అమ్మానాన్నలు పిల్లలకు చెప్పాలనుకోవడం లేదు. ఒక పాతిక ముప్పయ్యేళ్ల క్రితం?పిల్లలు తమని ఏ పిన్నో, బాబాయో, అత్తో, మామో తిట్టారని తల్లిదండ్రులకు చెబితే?.ఫరవాలేదు, పెద్దవాళ్లు ఒక మాట అంటే నష్టమేం లేదు? అయినా నువ్వేం చేయకుండానే అత్త ఆ మాట అనదు కదా?నువ్వేం చేశావు?చెప్పు? అని అడిగే పరిస్థితి ఉండేది. నలుగురు ఉన్నపుడు, నలుగురిలోకి వెళ్లినపుడు నాలుగుమాటలు వినడం, పడటం, లేదా వాటిని ఎలా ఎదిరించాలో, లేదా ఎలా సహనం పాటించాలో?. ఇవన్నీ పిల్లలకు అర్థమవుతుండేవి. ఇవన్నీ జీవితంలోని భిన్న పార్శ్వాలు. అదే ఇప్పటి పిల్లలు నన్ను ఫలనా టీచరు, లేదా ఫలానా బంధువర్గంలోని వ్యక్తి ఇలా అన్నాడు?.అనగానే?ఇంకేవి ‌ప్రశ్నించకుండానే?ఒక్కగానొక్క నా కూతురిని, నాకొడుకుని నేనే అంతమాట అనను? వాడంటాడా?అంటూ కాలు దూసే తల్లిదండ్రులే ఎక్కువ ఉంటున్నారు. అసలు ఇంతకుముందులా మేనమామలకు. పెద్దనాన్నలకు తాతలకు భయపడే పిల్లలు ఇప్పుడున్నారా?. ఇంట్లో భయం అనేది ఎలా ఉంటుందో, అవమానం ఎలా ఉంటుందో తెలియని పిల్లలకు ఒక్కసారిగా బయటి ప్రపంచంలో ఒడిదుడుకులు, అనుకోని విమర్శలు ఎదురయినపుడు, అప్పటివరకు ప్రేమని మాత్రమే చూసి ఉండటం వలన, ఒక్కసారిగా వారికి వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. మరో పక్క తమకు ఎంత ఇచ్చారో అంతా తమనుండి చదువు, ఉద్యోగాల రూపంలో డిమాండ్‌ ‌చేసే తల్లిదండ్రులకు చెప్పాలంటే అపరాధ భావన వెంటాడుతుంది. దాంతోవారు పూర్తిగా నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. అసలు వారికి మనం గాయపడకుండా ఉండటం ఎలాగో నేర్పడం లేదు?పోనీ ఏ గాయాలూ లేని సమాజాన్ని ఇచ్చామా?అదీ ఇవ్వలేదు. మన చేతులారా మనమే వారి మనసులను గాజుబొమ్మలుగా మార్చి, రాళ్లు కురిసే ప్రపంచంలోకి వెళ్లి ఆనందంగా ధైర్యంగా బతికేయ్‌ అని చెప్పినట్టుగా ఉంటోంది పరిస్థితి. ‌ప్రపంచాన్ని మార్చే శక్తి మనకు లేనపుడు, మన పిల్లలకు బయట ప్రపంచాన్ని యధాతథంగా పరిచయమన్నా చేయాలి. వారికి సమస్తం ఇచ్చేసి, పువ్వులా సున్నితంగా చూసుకోవడమే ప్రేమనుకుంటే అంతకంటే పెద్ద పొరబాటు మరొకటి ఉండదు. ఏవి లేని ప్రపంచంలో కూడా ఆనందంగా ధైర్యంగా బతకడమెలాగో నేర్పడమే నిజమైన బాధ్యత అవుతుంది. ఎప్పుడూ మనం డిగ్రీలు, జ్ఞానం, స్నేహితులు, పేరు ప్రఖ్యాతులు, ధనం, గౌరవం ఇలాంటివన్నీ సంపాదించుకోమనే పిల్లలకు చెబుతుంటాం. అలా ఉండడమే గొప్పతనమని నూరిపోస్తుంటాం. మన దృష్టిలో అలా ఉండడం మాత్రమే ప్రపంచం. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కూడా?అందుకు కూడా సిద్ధపడి ఉండాలి? అనే కనీస జ్ఞానమే అన్నింటికంటే గొప్ప జ్ఞానమని పిల్లలకు చెప్పాలి. ‌కానీ ఈ ఒత్తిళ్ల ప్రపంచంలో పిల్లలు ఒదగలేకపోవచ్చు?అప్పుడు వారేం చేయాలి? ఈ ప్రశ్న పిల్లలకు వేయవద్దు. అమ్మానాన్నలు తమకు తాము వేసుకోవాలి. పిల్లలు తాము పుట్టి పెరిగిన పొదరిల్లు దాటి భవిష్యత్తులో బతకబోయేది మన కలల ప్రపంచంలో కాదని, అత్యంత కృతకంగా, అస్తవ్యస్తంగా ఉన్న ప్రపంచంలోనని మనం గుర్తుంచుకోవాలి. పిల్లలు మనకు అందమైన పువ్వులే?కానీ వారు మానసికంగా సుశిక్షితులైన సైనికులుగా పెరిగితేనే వారు ఇతరుల మాటలకు గాయపడకుండా ఉంటారు?అలాగే ఇతరులను గాయపరచకుండా, తమనితాము గాయపరచుకోకుండానూ ఉంటారు. ఏమంటారు?..

Featured ఆంధ్రప్రదేశ్

క్యూబా కాలేజీలో జాబ్ మేళా – – – 60 మంది ఎంపిక

క్యూబా కాలేజీలో జాబ్ మేళా – – – 60 మంది ఎంపిక వెంకటాచలం, మార్చి 18 (పున్నమి విలేఖరి): వెంకటాచలంలోని క్యూబా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఉద్యోగ మేళా నిర్వహించినట్లు ఆ కళాశాల అకాడమీక్ డైరెక్టర్ డాక్టర్ హయ్యత్ రజ్వి తెలిపారు. తడ శ్రీ సిటీ ఆధ్వర్యంలో, క్యూబా ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తడలోని శ్రీసిటీకి చెందిన 3 కంపెనీలు ఉద్యోగ మేళాకు హాజరయ్యాయని, ఉద్యోగ మేళాకు 226 మంది అభ్యర్థులు విచ్చేశారన్నారు. ఇందులో 60 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఉద్యోగ మేళాలో ఎంపికైన అభ్యర్థులందరూ వారు ఎంపికైన కంపెనీల్లో రేపటి నుంచే విధులకు హాజరు కావచ్చు అని అన్నారు. కార్యక్రమంలో తడ శ్రీ సిటీ హెచ్ఆర్ షేక్ హిమాయత్ బాషా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాజిద్, కళాశాల ప్లేస్మెంట్ అధికారి పి.బాబు, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మానసిక బలవంతులు ఇలా వుంటారు….

మానసిక బలవంతులు ఇలా వుంటారు…. (పున్నమి ప్రత్యేకం) శారీరక సౌందర్యం కంటే మానసిక అందం ఎంత ముఖ్యమో, శారీరక బలం కంటే మానసికంగా స్ట్రాంగ్‌ ఉం‌డటం అంతే అవసరం. అసలు మానసిక బలం అంటే ఏమిటి, అది ఉన్నవారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు సైకో థెరపిస్ట్ ‌మోరిన్‌. ఆమె, థర్టీన్‌ ‌థింగ్స్ ‌మెంటలీ స్ట్రాంగ్‌ ‌పీపుల్‌ ‌డోంట్‌ ‌డూ అనే పుస్తకాన్ని రాశారు. మనం మానసికంగా ఎంత బల వంతులం అనే విషయాన్ని వార సత్వంగా వచ్చిన మన శరీరంలోని జన్యువులు, మన వ్యక్తిత్వ లక్షణాలు, మనం ఎదుర్కొన్న అనుభవాలు నిర్ణయిస్తాయని చెబుతున్నారామె. మానసిక బలవంతులు ఏఏ పనులు చేయరు. అనే అంశాలను పుస్త కంగా రాసిన ఆమె, మరి వారు ఏ పనులు చేస్తారు. అనే అంశం గురిం చి వివరణ ఇచ్చారు. ఆ విశేషాలు ఇవి- మానసిక బలవంతులకు భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి, వారు తమ ఎమోషన్స్‌ని అణ చేసు కుంటారని చాలామంది అను కుంటారు. కానీ అది నిజం కాదు. వారు తమలోని ఎమోషన్స్‌ని బాగా గమనిస్తారు. రోజంతా వాటిపై నిఘా ఉంచుతారు. తమ ఫీలింగ్స్ ‌తమ ఆలోచనలను, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలి స్తుంటారు. ఆ పరిశీలన వల్లనే వారు తమ భావోద్వేగాలతో కాకుండా ఆలో చనలతో పనిచేస్తుంటారు. ఒక ఫీలింగ్‌ ‌కారణంగా నష్టం కలుగుతుందనుకుంటే వారు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు కూడా. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఎవరూ ఉండలేరు. అలా ఉంటే అది నెగటివ్‌ ఆలోచనల్లోకి దారితీస్తుంది. అది మానసిక బలవంతులకు తెలుసు. అలాగే తమ ఆలోచనలన్నీకరెక్ట్ ‌కాదన్న సంగతిని వారు అర్థం చేసుకుంటారు. మైండ్‌ ‌నెగెటివ్‌ ఆలోచనల్లోకి వెళ్లి పోతున్నప్పుడు, వాటిని ఆపి వాస్తవం ఏమిటనే పునరాలోచన చేయగలుగు తారు. మానసిక బలవంతులు అను త్పాదక పనులు ఎప్పుడూ చేయరు. అంటే ఎవరికీ ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వని కాలక్షేపం పనులు. ఈ రోజు చాలా చెత్తగా నడిచింది. అనుకున్న సమయాల్లో, ఆ రోజుని అలా మార్చిం ది ఎవరు, ఏమిటి అనేది పరిశీలించుకుని, ఆ పద్ధతి మార్చుకుంటే కలిగే రిస్క్‌ని లెక్క వేసుకుంటూ ముందుకు నడుస్తారు. -మానసిక బలవంతులు తప్పులు చేస్తే అప రాధ భావం, పశ్చాత్తాపాలతో కుమిలిపోరు. దాన్నుండి పాఠం నేర్చుకుని తమని తాము క్షమించుకుంటారు. ముఖ్యంగా మానసి కంగా బలంగా ఉన్నవారు తమపట్ల తాము చాలా దయగా ఉంటారు. వీరు ఆత్మ విమర్శ చేసుకుంటారు కానీ, పనిగట్టుకుని విమర్శిస్తూ, కుంగదీసే మనసుని పట్టిం చుకోరు. తమ మాటలు, చేతలకు తామే పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఇతరులు తమని నడిపించాలని, నియంత్రించాలని ఆశించరు. మంచయినా, చెడయినా తమ పనులకు తామే బాధ్యులమని ఒప్పు కుంటారు. మానసిక బలవంతులకు కాలం విలువ తెలుసు. అందుకే వారు సమయాన్ని వృథా చేయరు. గతాన్ని తవ్వుకుంటూనో, ఇతరుల కోసం కాలం వెచ్చించి, తరువాత వారిని తిట్టుకుంటూనో కాలం గడపరు. ఏదైనా ఉత్పాదకతనిచ్చే పనిని మాత్రమే చేస్తారు. వీరి మెదడులో తమ లక్ష్యం తాలూకూ పూర్తి చిత్రం ఉంటుంది. ఈ రోజు తీసుకున్న నిర్ణయం, దీర్ఘ కాలంలో తమని ప్రభావితం చేస్తుందనే విషయం వీరికి తెలుసు. వారు ప్రతి సవాల్లోనూ ఒక అవకాశాన్ని సృష్టించు కుంటారు. తమకి తిరుగులేదు అనే అహంకారం మానసిక బలవంతులకు ఉండదు. ప్రతిరోజూ ఎదిగేందుకు సిద్ధంగా ఉంటారు. తమ బలహీన తలను గుర్తిస్తారు, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వీరికి తప్పులకు సాకులు వెతుక్కోవడం కంటే, వాటి గురించి పూర్తిగా తెలుసుకుని, మరొక సారి అలా జరగకుండా జాగ్రత్త పడ టమే ఇష్టం.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మనలను కరిచిన కుక్కను ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి.

మనలను కరిచిన కుక్కను ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి. మనల్ని కరిచిన కుక్కను ఏమి చేయాలి? చేసేది ఏముంది, కొట్టి చంపి పారేయాలి అన్నది ఎక్కువమంది చెప్పే సమాధానం.ఇది తప్పు. ఆ కుక్కను కొట్టకూడదు. చంపకూడదు. బ్రతికించు కోవాలి. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క పది రోజులు బ్రతికుంటే మనకు దానివలన రేబీస్‌ ‌వ్యాధి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి .ఎంత జాగ్రత్తగా అంటే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి చూసుకున్నంత జాగ్రత్తగా. రేబిస్‌ ‌వ్యాధి మనకు రావాలంటే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ ‌వ్యాధి ఉండి దాని లాలాజలంలో వైరస్‌ ఉం‌డాలి. అలా లాలాజలంలో వైరస్‌ ఉన్న కుక్క వారం లోపల చనిపోవలసిందే. రేబిస్‌ ‌వ్యాధి వచ్చి వారానికి మించి బ్రతికిన జంతువు ఇంతవరకు లేదు. మనల్ని కరిచిన కుక్క వారానికి మించి బతికింది అంటే దానికి రేబీస్‌ ‌లేదు .మరి దానికే లేనప్పుడు అది కరవడం ద్వారా మనకు రేబీస్‌ ‌వచ్చే అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికే మనల్ని కరిచిన కుక్కని పదిరోజులపాటు గమనించుకోవాలి. కుక్క కాటు గాయాన్ని ఏం చేయాలి? వీలైనంత త్వరగా గాయాన్ని నీళ్ళతో కడగాలి. వీలైతే సబ్బుతో కడగడం మంచిది. గాయాన్ని పైపైన కడగడం కాదు లోతుగా కడగాలి. అందుకే కుళాయి కింద గాయ మైన భాగాన్ని ఉంచి గాయం లోపలకు నీరు పోయే విధంగా కడగాలి. అప్పుడే గాయం లోపల ఉన్న రేబిస్‌ ‌కారక వైరస్‌ ‌పూర్తిగా తొలగిపోతుంది. కరచిన వెంటనే కుళాయి అందుబాటులో లేనప్పుడు మగ్గులో నీరు తీసుకుని ఎత్తులో నుంచి గాయం మీద పడేటట్టుగా కడగడం మంచిది. ఇలా కనీసం పది సార్లు కడగాలి.ఇలా వెంటనే గాయాన్ని కడగ గలిగితే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ ఉన్నా దానివలన మనకు వచ్చే అవకాశం దరిదాపుగా లేనట్టే. రేబిస్‌ ‌వ్యాధి సోకి, బ్రతికిన జీవి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వ్యాధికి ఇంతవరకు వైద్యం కనుగొనబడలేదు. ఈ వ్యాధి సోకితే వారంరోజుల్లో చనిపోవలసిందే . ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు 1885 సంవత్సరంలోనే లూయిస్‌ ‌పాశ్చర్‌ అనే మహనీయుడు కుక్క కాటుకు టీకాను కనుగొన్నాడు. అంటే 134 సంవత్సరాల క్రితం ఈ రేబిస్‌ ‌వ్యాధి కి టీకా అనుకొన్నపటికీ వ్యాధి నివారణ మాత్రం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 వేల మంది రేబీస్‌ ‌వ్యాధితో చనిపోతున్నారు ఇందులో 20 వేల మంది మన దేశంలోని వారే చనిపోతున్నారు. ఈ రేబిస్‌ ‌వ్యాధి సంక్రమించేది కుక్క కాటు ద్వారా మాత్రమే కాదు.నక్క ,పిల్లి,కోతి, గబ్బిలం లాంటి జంతువులు కరవడం ద్వారా కూడా సంక్రమించ వచ్ఛు.భారత దేశములో 98% మంది లో రేబీస్‌ ‌వ్యాధికి కారణం కుక్క కాటే. రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ఎలా వేయించుకోవాలి? కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారని గతంలో ఉన్నటువంటి వైద్య సూత్రం. ఇప్పుడు బొడ్డుచుట్టూ వేసే టీకా అనేక దేశాల్లో రద్దు చేయబడింది. 2004నుంచి మన దేశంలో కూడా రద్దు చేయబడింది. ఇప్పుడు కండలోకి వేసే టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ఐదు విడతలుగా వేయించుకోవాలి. మొదటి డోసు కరిచిన వెంటనే, రెండవ డోసు మూడవరోజు, మూడవ డోసు ఏడవ రోజు, నాలుగవ డోసు 28వ రోజు. (0-3-7-14-28). ఈ 5 విడుదల టీకా ఖర్చు సుమారు 2000 రూపాయలు అవుతుంది.ఈ ఖర్చును పేదలు భరించడం కష్టం. ఖర్చును తగ్గించడానికి పరిశోధనలు జరిపి ప్రస్తుతం చర్మంలోకి వేసే టీకాను కనుగొన్నారు. ఈ టీకాను నాలుగు విడతలుగా వేయించుకోవాలి (0-3-7-28) దీని మొత్తం ఖర్చు సుమారు 400 రూపాయలు.. ఈ టీకాను ఎప్పుడు వేయించుకోవాలి? కరిచిన వెంటనే వీలైనంత త్వరగా టీకా వేయించుకోవడం మంచిది. మనలను కరిచిన కుక్క మంచిదో, పిచ్చిదో మనం గుర్తించడం కష్టం. మొదటి మరియు రెండవ డోసును వేయించుకుని, మనల్ని కరిచిన కుక్కను గమనించడం సాధ్యం కాకపోయినా, కుక్క చనిపోయినా ఏడవ రోజు వేయించుకోవాల్సిన మూడవ డోసును తప్పక వేయించుకోవాలి. కుక్క బ్రతికుంటే మిగిలిన డోసులను వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ జాగ్రత్తలు కుక్క కరిచినప్పుడే కాదు, పిల్లి, కోతి, నక్క, గబ్బిలం, గాడిద, గుర్రం ఇలాంటి జంతువులు కరిచినప్పుడు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్‌ ‌యం.వి.రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక (ఆంధప్రదేశ్‌) ‌డా.రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మీరు బిజీబిజీనా…. ప్రాణానికి ముప్పు జాగ్రత్త….

చాలామంది ఆడవాళ్లు తమ ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పనిచేస్తుంటారు. పని అయిపోవడమే ముఖ్యమని భావిస్తుంటారు. అంతేకాదు, ఎంత ఎక్కువ శారీరక శ్రమ చేస్తే అంత గొప్ప? అనే భావన సైతం మహిళల్లో ఉంటుంది. మన సినిమాలు సాహిత్యం లాంటివి కూడా అలాగే చూపుతుంటాయి. ముగ్గులేస్తే అయిదోతనమని, ఇల్లు ఊడిస్తే ఇంటిదీపమని? ఇలా మహిళల భావోద్వేగాలకు చాకిరిని ముడిపెట్టి, మళ్లీ వాటికి అందమైన సాహిత్యంగా పేరుపెట్టి సమాజంలోకి ఎక్కించారు. కాస్త పదజాలం మారి?అవన్నీ ఇప్పుడు ఆధునిక మహిళల సామర్ధ్యాలుగా, మల్టీ టాస్కింగ్‌గా మనముందుకు వస్తున్నాయి. ఇంటిపనిని పనిలాగే చూస్తే సరిపోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ అన్ని పనులను చేసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఇంటి చాకిరికి స్త్రీత్వాన్ని జోడించడం, ఉత్తమ మహిళల లక్షణాలుగా పనులను పేర్కొనటం?ఎంత తెలివితక్కువ వారికైనా అర్థమైపోతుంది?ఇదంతా చాలా చాకచక్యంతో చేస్తున్న మోసమని. ఆహారం, పని, విశ్రాంతి, నిద్ర ఇవి జీవులన్నింటికీ సమానమే. పనిఒత్తిడితో వీటి మధ్య సమన్వయం లోపిస్తే?మహిళల ప్రాణాలకే ముప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకకాలంలో అనేక పనులను నిర్వహిస్తూ ఇంటిపని, ఆఫీసులో ఒత్తిళ్లతో తలమునకలయ్యే మహిళలకు జీవిత కాలం తగ్గిపోతుందని అమెరికాలోని ఒహాయో స్టేట్‌ ‌వర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారంలో 40 గంటలకు మించి 30 ఏళ్లపాటు నిరంతరాయంగా శ్రమించిన మహిళలకు మధుమేహం, క్యాన్సర్‌, ‌గుండెజబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాల్లో రుజువైనట్టుగా వారు వెల్లడించారు. అలాగే వారానికి పనిగంటలు 60 కంటే ఎక్కువుంటే వారిలో ఈ ముప్పు మూడురెట్లు పెరుగుతుంది. అయితే పురుషులు ఇంతగానూ శ్రమించినా వారిలో వ్యతిరేక ప్రభావాలు మహిళల స్థాయిలో కనిపించలేదని వారు వెల్లడించారు. అందుకే అందరికీ న్యాయం చేయాలని తపించే ముందు మహిళలు, తమకు తాము కూడా న్యాయం చేసుకోవాలని ఆలోచించాల్సిందే మరి.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

లావు తగ్గాలా?

లావు తగ్గాలా? ‘‘పీత పాట్లు పీతవి’’ అనేది తెలుగు నానుడి. పీతకు పాట్లు ఉన్నాయో లేవో తెలి యదు కానీ ఉన్న పాట్లు అన్నీ మనిషికే. కాకుంటే మనుషులుగా మనం ఆ సంగతిని నేరుగా ఒప్పుకోము. పిల్లి మీదా, కుక్క మీదా పెట్టి అదేదో తెగ ఇక్కట్లు పడుతూ ఉన్నట్టు జాలి చూపెట్టి ‘తుత్తి’ పడుతాం. ఆ కోవ లోనిదే కా ఒచ్చు ఈ పీత కష్టాలు కూడా. నిజానికి ప్లాట్లు, ఫ్లాట్లు కొని వెనుక వేసుకుందాము అనే పాట్లూ, ఫీట్లు తిన్న దాన్ని తినకుండా ఎప్పుడూ వెరయిటీగా తినాలి అను కొనే తిప్పలూ, కష్టాలు ఉండేది మనకే. మనం అంటే ఎవరూ? నేనూ, మీరూ, మన ఇంట్లో వారు, చుట్టు పక్కల జనం, ఊరు, పక్క ఊరు, ఆ పక్క ఊరు… వీరిలో తిప్పలు పడే వారు. తిప్పలు పడే వారు అంటే ఎవరికి ఏది కావాలో అది అందని వారూ, ఎవరు ఏది అనుకుంటారో అది జరగని వారు. ఈ రెంటికీ కారణం ‘కోరిక’లే అని బోది చెట్టు తోడుగా బుద్ధ భగవానుడు నెత్తీ నోరు మొత్తుకున్నా అది మన నెత్తికి ఎక్క లేదు. కావాలసినవి దొరక బుచ్చు కోనూ, అనుకున్నవి తీర్చుకోనూ దారులు దొరక్క, ‘‘దేవుడా! ఎక్కడ ఉన్నావయ్యా నువ్వూ..?’’ అంటూ దొరికిన చెట్లకూ చెట్లకూ రాళ్ళకూ రప్పలకూ మొక్కుకుంటూ, కనపడ్డ గుళ్ళకూ గోపురాలకు తిరిగే జనానికి కొదవ లేదు కదా!, చెట్టులు, పుట్టలు, దేవుడి విగ్రహాలు మన మాటలు వినటమే తప్ప గోడు వెళ్ళ పోసుకున్న వారికి నేరుగా ఏదయినా పరిష్కారాన్ని చూపు తాయా అంటే అదీ లేదు. మొక్కుకున్నాక మంచి జరిగితే అంతా ఆ పయి వాడి దయ అనుకోవటం, జరగక పోతే దేవుడు నా మొర ఆలకించ లేదనో, ఆలకించక పోవటానికి ఏదో గట్టి కారణమే ఉంటుందని సర్దుకొని మళ్ళీ మన తిప్పలు ఏవో మనం పడక తప్పదు. బహుశా స్పందించని దేవుడి చోటును భర్తీ చేసేందుకే కాబోలు కానుకలు తీసుకొని స్పం దించే స్వాములు, బాబాలు, అమ్మలు అవ తారం ఎత్తారు. దేవుడిని నిలువెల్లా తమలో నింపుకున్నాము అనేది వీరి అనిపింపు. సాధా రణ జనానికి నమ్మింపు. ఏ మాటకు ఆ మాటే మాటాడు కోవాలి. నిష్టూరంగా ఉన్నా నిజాలు మాట్లాడుకో వద్దూ? అసలు పాట్లు లేని జనం ఎక్కడ ఉంటారు చెప్పండీ? అమెరిక అధ్యక్షుడు ఒబామా అయినా, ఆముదాలవలసలో అంగడి నడిపే అంజయ్య అయినా వారి పుట్టుక మనిషి గానే కదా! మనిషి అన్నాక పాట్లు తప్పవు. ఎలాంటి పాట్లు ఉండ వచ్చూ? ఎలాంటివి అయినా ఉండ వచ్చు. తిండి కోసం సత్యనారాయణ పాటు పడ తాడు. తిన్నది అరగ లేదని కొండల రావు ఏడుపు. అరుగుతుంది కానీ ఆ అరిగింది ఒంటికి పట్టటం లేదు అనేది నారాయణ అను మానం. అసలు ఏమి తినాలి అనేది గంగా రాం అడక. ‘సల్పేటు’ కూటిలో సత్తానే లేదు కాబట్టి ‘ఆర్గానిక్కు’ పుడ్డు లోనే అయిదో తనం ఉందనే సంగతిని బలరాం బల్ల గుద్ది మరీ చెబుతుండే! చూడండీ! ఎన్ని తిప్పలో! ఎన్ని ఇక్కట్లో!! ఎన్ని సమస్యలో!!!. ఒక్క తిండి సంగతి లోనే. చెప్పే వాడికి వినే వాడు లోకువ. వినే వాళ్ళు అంటే తెలియని వారు అని ఇక్కడ తెల్లము. తెలియని వారు ఉన్నంత వరకూ తెలియ చెప్పే వారు పుట్టుకు రావటం సహజం. అంటే తెలియని వారికి దారి చూపటం కోసం తెలిసిన వారు వెలుస్తారు అన్న మాట. చెప్పే వాళ్ళూ రెండు రకాలుగా ఉంటారు. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే వారు తొలి రకం. సమస్యకు పరిష్కారం చూపండయ్యా అంటే కష్టం అయినా ఇదే మంచి దారి అని చెప్పే రకం. అంటే గులక రాళ్ళ దారి వయిపు చూపించే రకం. భారత జాతి బానిస బతుకు నుంచి బయట పడటానికి గాందీ తాత చూపిన దారి ఇది.నడిచే దారి కష్టం అయినా గెలుపు తధ్యం. కానీ షరా మామూలే! ఇది ఎక్కువ మందికి నచ్చదు. ‘‘అబ్బే ఈ దారిలో నడవటం కష్టం!’’ అని అనుకున్నారు అనుకోండి దాని అర్థం ‘‘దగ్గరి దారులు ఏమయినా ఉన్నాయా అని అడగకనే అడిగినట్టు కదా! ఇక్కడ దగ్గరి దారులు అంటే అడ్డదారులూ అని చదువు కోమని మనవి. ‘అడ్డ దారులు’ అనే మాటను నేరుగా బయటకు ఒప్పుకోక పో ఒచ్చు. కానీ ముమ్మాటికి ఎక్కువ మంది జనంలో ఉండే ఆలోచనా తీరు అదే. అనుకున్న వెంటనే పని అయిపోవాలి, కష్ట పడకుండా పని జరగాలి, సులువుగా జరిగి పోవాలి… అని అనుకొనే వారి కోరికలను నెర వేర్చటానికి అంటే తెలియని వారికి తెలియ చెప్పటానికి పుట్టుకు ఒచ్చిన కారణ జన్ములు మలి రకం. నిజం చదువును చదివారో లేదో తెలియదు కానీ జనం ఫేసు ఫీలింగు చదివే ‘ఉత్త’ములు ఈ మలి రకం కోవలో వారే. ఇదిగో!! మీకు కావాల్సి వాటిని సులువు దారుల్లో ప్రసాధిస్తాం’’ అనే అవతార పురుషులు వీరు. ‘‘భార్యా భర్తలు పార్వతీ పరమేశ్వరుల్లా అన్యోన్యంగా ఉండాలి’’ అంటాడు పెళ్ళాం పోరు పడలేక కషాయం కట్టి స్వామి అవ తారం ఎత్తిన రాఘవరావు వురఫ్‌ శ్రీశ్రీశ్రీ ‌రావు రాఘవేంద్ర స్వామీ కంత్రీజి. ‘‘ఆ..హా.. స్వామీజీ ఎంత బాగా సెల విచ్చారూ.. విన్నావుటే వెధవ ముండా! నువ్వు ఎప్పుడయినా నాతో అన్యోన్యంగా ఉన్నావా? ఆ.. స్వామి వారు చెప్పింది అయినా తలకు ఎక్కించుకొని అన్యోన్యంగా ఉండి చావు’’ మంచి బతుకు ఎలా బతకాలో జనానికి చెప్పటానికి ఏర్పాటు చేసిన ప్రబోధ సభలకు నాలుగు వందల కిలో మీటర్ల నుండి పెళ్ళాంతో ఒచ్చిన కనకారావు విసుగు అది. ‘‘ఇదుగో రోజూ ఈ వేప పుల్ల నమలండి! ఆ కషాయం తాగండి ఇలా ఆసనాలు వేయండి!! ఇక మీ జీవితం స్వర్గానికి బెత్తడు అంటే బెత్తెడు దూరంలో’’ కాళ్ళూ చేతులు మెలెసుకొని టీవిలలో దూరిన కార్పోరేటు యోగా గురువు దేకు బాబా పిలుపు. మా ఆశ్రమంలో తయారు చేసిన కషాయం మాత్త రమే సుమా! ఇది కొస మెరుపు. ‘‘ఉప్పు తినకు ఊరి పోతావు, నిప్పులోది తినకు కాలిపోతావు – మీ కోసం పెసలూ పప్పులు స్పెషలుగా పండించి తెచ్చా. అంగట్లో కొంటే అసలు దనం ఉండదు. నా విత్తనాలలో జీవం ఉంది. నాన పెట్టి మొలక ఎత్తాక తినండి’’ రెండు గంటలు ప్రబోధించి వెనుక వెంట తెచ్చుకున్న లారీ గింజలను అమ్ముకునే మాటు అజెండా.‘‘లావుగా ఉన్నారా? మా ప్రోటీను పొడిని వాడండి. గాలి తీసిన బెలూనులా బక్క పడి పోతారు. దీని అసలు ధర పది వేలు. మీ కోసం రెండు వేలకే ఇస్తున్నాము’’ మద్దినేళ అన్నీ టీవీలలో ఒకే సారి ఊదరగొట్టే ప్రకటనలు. ‘‘బనూసు ఒబేసిటీ రిడక్షను పోగ్రాంలో చేరండి నెల రోజుల్లో మీ షేపులు మారుస్తాం’’ ఒక పక్క అడ్డంగా సాగబీకిన పోటో మరో పక్క కుదించిన ఫోటోతో అట్టహాసంగా పత్రి కల అట్టల మీద రంగు రంగుల యాడులు. ‘‘ఇదుగో బోనా బెల్టు. దీన్ని పొట్టకు కట్టు కుంటే మీరు ఎంత తిన్నా ఆ కొవ్వు అట్టే కరిగిపోతుంది’’ ‘‘మీరు తిండి మానక్కర్లా! పని చెయ్యనక్కర లేదు. మీ ఇంటి దగ్గరే ఉండి లావు తగ్గటానికి ఈ ఫోను నంబరును సంప్రదించండి. బీడీ బంకుల దగ్గరా, ఏటీఎంల వద్ద, అపార్టు మెంట్ల ముందు అంటించిన డీటీపీ కాగితాలు లావు తగ్గటానికి మార్కెట్టులో ఉన్న వస్తు వులు, తిండ్లు, పద్ధతులు, జీవన విధానాల గురించి రాసుకుంటూ పోవాలే కానీ ఈ పేపరు అంతా వాటి తోనే నిండి పోతుంది. ఇంతకీ చెప్చొచ్చేది ఏమిటంటే అందరికీ తెలిసిన సంగతే మళ్ళీ మళ్ళీ చెబుతున్న సంగతే ‘‘లావు తగ్గటానికి మంచి దారి లావు పెరగ కుండా ఉండటం’’. ఎంత పని చేస్తారో అంతే తినటం దీనికి పాటింపు. డాక్టర్‌ ‌పి. శ్రీనివాస తేజ

Featured ఆంధ్రప్రదేశ్

అమరజీవి కి ఘన నివాళి

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ ఏ పద్మావతి గారు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ఏ పద్మావతి గారు మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని ఆయన 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా చేశారని రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని,ఆయన త్యాగనిరతి మరువలేనిదని ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జహీర్ , సాయి ఇంకా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.