పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
యలమంచిలి: యలమంచిలి మండలం కొక్కిరపల్లి జంక్షన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్లే రహదారిపై సుమారు 40–45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి రహదారిపై పడిపోగా, అదే మార్గంలో ప్రయాణించిన ఇతర వాహనాలు అతని శరీరం మీదుగా వెళ్లడంతో మృతదేహం తీవ్రంగా ఛిద్రమై, గుర్తుపట్టలేని స్థితిలో లభించింది. మృతుడి పేరు, స్వస్థలం, ఇతర వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు. మృతుడు బిచ్చమెత్తుకుంటూ జీవించే వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.
కొక్కిరపల్లి వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి గుర్తింపు కోసం చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


