పున్నమి ప్రతినిధి ఆనంద్ – ఎలమంచిలి
ఎలమంచిలి మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని ఎలమంచిలి సీఐ ఎస్. ధనుంజయరావు సూచించారు. వినాయక విగ్రహాల వద్ద తప్పనిసరిగా తగిన సేఫ్టీ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా తక్కువ శబ్దంతో సౌండ్ సిస్టమ్ వినియోగించాలని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజే బాక్సులు, సౌండ్ స్పీకర్లు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. నిమజ్జనం సమయంలో కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలకు తావులేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించి కార్యక్రమాల్లో పాల్గొనడం, అసభ్యకరమైన నృత్యాలు, కార్యకలాపాలకు పాల్పడటం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.


