ఏళ్ల తరబడి నిలిచిన పనులకు కదలిక – రూ.1.78 కోట్లతో కొత్త ఊపిరి
ఆత్మకూరు క్రీడాకారులకు త్వరలో ఆధునిక వసతులు – మంత్రి ఆనం ఆదేశాలు
ఆత్మకూరు, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి ): ఆత్మకూరులో నిర్మాణంలో ఉన్న క్రీడా వికాస కేంద్రం పనులను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు.ఆత్మకూరు ప్రాజెక్టు కింద క్రీడా వికాస కేంద్రం 2017 సెప్టెంబర్లో మంజూరు కాగా, 2018 ఆగస్టు 18న పనులు ప్రారంభమయ్యాయి. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే సుమారు 50 శాతం పూర్తయినట్లు మంత్రి తెలిపారు.గత ఎనిమిదేళ్లుగా నిధులు విడుదల కాకపోయినా కాంట్రాక్టర్ సుమారు రూ.1 కోటి వరకు సొంత నిధులు వెచ్చించి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. SAP ఛైర్మన్ రవినాయుడు చొరవతో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ అంగీకరించారని తెలిపారు.మిగిలిన పనులతో పాటు అవసరమైన అదనపు అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.78 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు SAP అధికారులు అంగీకరించినట్లు మంత్రి వెల్లడించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం మూడు నెలల్లో పనులను పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, క్రీడా రంగంలో ఆత్మకూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ, క్రీడా శాఖ, మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు, కన్సల్టెన్సీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు


