కాంగ్రెస్ అంటేనే దగా, మోసం
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
*కేసీఆర్ రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం*
*కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారు*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సెప్టెంబర్ 2
ఖమ్మం:
కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు మోసపోవడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే హెచ్చరించారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టి, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గురుకుల విద్యార్థులు కూడా అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారని అన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ముందు అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వంచించారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా వారిని మోసం చేస్తోందని అన్నారు. పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ తిరిగి రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో ఖమ్మం జిల్లాలో ఒక్క మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి పనులను, ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ చేయలేని దుస్థితి నెలకొందని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను నష్టపరుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లిందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ, పూర్తి పనులపై తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం జర్నలిస్టుల కోసం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని ఇప్పటికీ జర్నలిస్టులకు కేటాయించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు.



