ఖమ్మంనగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేక దృష్టి సారించారు. మున్నేరు నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అనువైన చెరువులను మంగళవారం ఆయన పరిశీలించారు. సంబంధిత పోలీస్ అధికారులు, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు చెరువును సందర్శించి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విగ్రహాల తరలింపు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని సునీల్ దత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, ఇన్స్పెక్టర్లు మోహన్ బాబు, భానుప్రకాష్, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు వినోద్ లాహుటి, గేంటెల విద్యాసాగర్ శ్రీహరి, ప్రసన్నకృష్ణ, వేల్పుల సుధాకర్, యుగేందర్ శర్మ, సురేష్శ ర్మ పాల్గొన్నారు.


