పట్టణ ప్రజల దీర్ఘకాలిక కోరికను నెరవేర్చాలని సీపీఐ(ఎం) వినతి
ఆత్మకూరు, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా టౌన్ హాల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) పార్టీ ఆత్మకూరు పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారికి సీపీఐ(ఎం) పార్టీ ఆత్మకూరు పట్టణ కార్యదర్శి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆత్మకూరు మున్సిపాలిటీగా ఏర్పడి సుమారు 14 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు టౌన్ హాల్ నిర్మాణం చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 35 వేల జనాభా, 23 వార్డులతో విస్తరించిన పెద్ద మున్సిపాలిటీగా ఆత్మకూరు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రజలకు అవసరమైన టౌన్ హాల్ సౌకర్యం లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.పట్టణ ప్రజలు తమ సామాజిక, సాంస్కృతిక, విద్యా, వివాహాది కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల దీర్ఘకాలిక కోరికను దృష్టిలో ఉంచుకుని, పట్టణ పరిధిలో అందుబాటులో ఉన్న అనువైన స్థలాన్ని గుర్తించి టౌన్ హాల్ నిర్మాణానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ ఆత్మకూరు పట్టణ కమిటీ వినతిపత్రం ద్వారా కోరింది.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి. శివప్రసాద్, సీపీఐ(ఎం) పార్టీ నాయకులు ఆత్మకూరు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


