విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 31 :::
విశాఖపట్నం సిరిపురం సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రోశయ్య గారు రాజకీయ విలువలకు మానవ రూపం, రాజకీయ హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం అని కొనియాడారు.
ప్రజాసేవ, నిజాయితీ, నిబద్ధత, రాజకీయ విలువలకు రోశయ్య గారు ప్రతీకగా నిలిచారని అన్నారు. సిరిపురంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహంగా కాకుండా ‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్‌మాన్’గా నిలవాలని ఆకాంక్షించారు.
సమాజ శ్రేయస్సు కోసం రోశయ్య గారు చేసిన సేవలు, ఆయన రాజకీయ ప్రస్థానం, ప్రజా జీవితంలో ఆయన చూపిన విలువలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్ర, రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవా కార్యక్రమాలు, ముఖ్య ఘట్టాలు ప్రజలకు తెలిసేలా రోశయ్య గారి జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రోశయ్య గారి సేవలు, ఆలోచనలు యువతకు స్ఫూర్తిగా నిలిచేలా వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని నారా లోకేష్ అన్నారు. అనంతరం రోశయ్య గారి కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడి ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
రోశయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రజలకు భావోద్వేగంతో కూడిన ఘనమైన సందర్భంగా నిలిచింది.











