గురునానక్ వద్ద ప్రమాదాలకు చెక్!
రోడ్డు మధ్యలో సూచిక స్టిక్స్ ఏర్పాటు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27: ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద సాగర్ హైవేపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు మధ్యలో సూచిక స్టిక్స్‌ను ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సమక్షంలో ట్రాఫిక్ సీఐ జితేందర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సూచిక స్టిక్స్‌ను ఏర్పాటు చేశారు. కళాశాల ముందు వాహనాల రద్దీ కారణంగా విద్యార్థులు, ప్రయాణికులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఈ చర్యలు చేపట్టినట్లు ఏసీపీ రాజు తెలిపారు.
వాహనదారులు సూచికలను గమనించి నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి, యాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



