పున్నమి: హైదరాబాద్, వేడుక ఏదైనా పర్యావరణ హితంగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా మారాలి. గణేష్ ఉత్సవాలతోనే ఇది ప్రారంభం కావాలి.. స్వాతంత్ర సంగ్రామానికే గణేష్ ఉత్సవం ఊతమిచ్చింది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడాలి. నగరంలో చెరువులన్నీ కాలుష్య రహితంగా మారాలి. ఆక్రమణలను తొలగించి చెరువులను హైడ్రా విస్తరిస్తోంది. మురికి కూపాలుగా ఉన్న చెరువులలో పూడికను మొత్తం తొలగించి మంచి నీటి సరస్సులుగా మార్చేందుకు హైడ్రా గట్టి ప్రయత్నం చేస్తోంది. మురుగు నీరు కలవకుండా ప్రతి చెరువు వద్ద ఎస్‌టీపీ(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో చెరువులు కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. గణేష్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకునే ప్రతి చెరువు వద్ద బేబీ పాండ్‌లను నిర్మిస్తున్నాం. ఇలాంటి తరుణంలో నగర ప్రజలు కూడా పర్యావరణ హితమైన మట్టి గణేష్ విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వాలి“ అని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా ఇప్పటికే చాలా మార్పు వచ్చి ఇళ్లల్లో పెట్టే చిన్న విగ్రహాలను మట్టితో రూపొందిస్తున్నారు. ఉత్సవ ఊరేగింపునకు అనుగుణంగా పెద్ద విగ్రహాలు కూడా మట్టితో తయారయ్యేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సాంకేతికను అంది పుచ్చుకోవాలని.. ఆ దిశగా నిపుణులు ఆలోచించాలని కోరారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలతో కలసి పని చేసేందుకు హైడ్రా సిద్ధంగా ఉందన్నారు. పర్యావరణ హితమైన నగర నిర్మాణంలో ప్రభుత్వం చూపుతున్న చొరవే హైడ్రా ఏర్పాటని.. ఆ క్రమంలోనే మట్టి విగ్రహాలపై కూడా అందరూ దృష్టి సారించాలని నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కలిసి విజ్ఞప్తి చేశాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కలిగే నష్టాలను.. మట్టి విగ్రహాలతో కలిగే లాభాలను వివరిస్తూ రూపొందించిన పోస్టర్‌ను హైడ్రా కమిషనర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఒక్క రూపాయికే మట్టి విగ్రహాలను అందిస్తున్నామని ఈ సందర్భంగా లైఫ్ సేవర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శివ నేత తెలిపారు. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులు ఎంతో పర్యావరణ హితంగా మారుతున్నాయని.. వాటికి మన ఉత్సవాలు కూడా తోడవ్వాలని.. అందరూ మట్టి విగ్రహాలకు జై కొట్టాలని సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోపి శంకర్ యాదవ్ ఆకాంక్షించారు. సర్వాయి పాపన్న చారిటబుల్ ట్రస్ట్,BASS GROUP ఇమ్మడి విజయభాస్కర్, అమ్మా ఫౌండేషన్, అనుశ్రీ చారిటబుల్ ట్రస్ట్, వారాహి ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, అనిల్‌కుమార్, అను పులెపాక తదితరులు హైడ్రా కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, అదనపు కమిషనర్లు ఆర్ సుదర్శన్. ఆనంద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



