పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష
పున్నమి దినపత్రిక ఆగష్టు19,2026:డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశం మందిరంలో శ్రీవత్స ఫౌండర్ సీఈవో బమిడిపాటి కిరణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ
వాడపల్లి ఆలయ అభివృద్ధికి సంబంధించి రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌ను సమగ్రంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను సూచించారు.ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఆలయ ప్రస్తుత పరిస్థితి, భక్తుల రాకపోకలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, భవిష్యత్‌లో పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు వివరాలు సమర్పించారు.మాస్టర్ ప్లాన్‌లో ఆలయ ప్రాంగణ అభివృద్ధి, భక్తుల రాకపోకలకు అనుగుణంగా రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుధ్యం, క్యూలైన్ వ్యవస్థ, భక్తుల విశ్రాంతి ప్రాంతాలు, వాహనాల నియంత్రణ, పచ్చదనం, పరిసరాల సుందరీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను శాస్త్రీయంగా రూపొందించాలని, రద్దీ సమయాల్లో భక్తుల నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులకు అనుకూలంగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, పచ్చదనం తదితర అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, అవసరమైన మార్పులు, చేర్పులు చేసి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలను అంచనా వేసి తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు.వాడపల్లి ఆలయ అభివృద్ధి పనులు భక్తుల సౌకర్యాలతో పాటు ప్రాంతీయ పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌ను నాణ్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో అమలాపురం ఆర్డీవో జి వి వి సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారి వి సత్యనారాయణ,జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు, అగ్నిమాపక శాఖ అధికారి పార్థసారథి, ఆత్రేయపురం ఎమ్మార్వో టి. రాజేశ్వరరావు,ఇండస్ట్రీస్ జిఎం అరుణ జిఐఎస్ కోఆర్డినేటర్ లీర్తి, ఇంజినీరింగ్ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




