రాజమహేంద్రవరం, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్., జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఐఏఎస్‌తో కలిసి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని కొంతమూరు, కాతేరు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పుష్కర్ నగర్, షటిల్ బస్ స్టాప్‌లు, బస్సుల రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, అత్యవసర సేవలు, పోలీసు సిబ్బంది వసతి తదితర అంశాలపై అధికారులు చర్చించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రవాణా, భద్రతా ఏర్పాట్లను ముందుగానే ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలను సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.


