ఆత్మకూరు, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేసిన విమర్శలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆత్మకూరు అభివృద్ధికి ఆనం చేసిన కృషిని చూడకుండా విమర్శించడం అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఆనం ఆర్థిక, దేవాదాయ శాఖ మంత్రిగా నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చారని తెలిపారు. రహదారులు, బృహత్తర తాగునీటి పథకం, రెవెన్యూ డివిజన్, మున్సిపల్ కార్యాలయం, వంద పడకల ఆసుపత్రి, విద్యా సంస్థలు తదితర పనులు చేపట్టారని, గత రెండేళ్లలో సుమారు రూ.6,500 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ సాధనలో ఆనం కీలకపాత్ర పోషించారని తెలిపారు. మేకపాటి కుటుంబ సభ్యుల హయాంలో జరిగిన అభివృద్ధి, ఆనం సాధించిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, కేత విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


