నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీ ముందే లీకైందన్న ఆరోపణలు వస్తున్నాయి.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గురువారం ఆకస్మికంగా పర్యటించి రేషన్ దుకాణాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హాస్టల్‌ను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు, విద్యార్థులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆయన క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. రేషన్ షాపులో బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ, కొలతలపై లబ్ధిదారులను నేరుగా ప్రశ్నించి వివరాలు సేకరించారు. సరుకులు నాణ్యతగా అందుతున్నాయా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలు, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు.హాస్టల్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి మెనూ ప్రకారం గుడ్లు, చికెన్, ఇతర పోషకాహారం అందుతున్నాయా, భోజనం నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రజలకు, విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చైర్మన్ ఆదేశించారు. ఆకస్మిక తనిఖీ ఉద్దేశానికే భంగమా? అయితే రాష్ట్ర స్థాయి అధికారి వస్తున్నారనే సమాచారం ముందుగానే సంబంధిత శాఖలకు చేరడంతో రేషన్ డీలర్లు, హాస్టల్ వార్డెన్లు, సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తనిఖీలకు ముందు ఏర్పాట్లు చేసి, ఉన్న లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.ఆకస్మిక తనిఖీల అసలు ఉద్దేశం వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడమేనని, కానీ ముందుగానే సమాచారం లీక్ కావడం వల్ల వాస్తవ పరిస్థితి బయటపడే అవకాశం తగ్గిపోతుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.గ్రామస్థుల అభిప్రాయం రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటించే విషయాన్ని ముందుగానే సంబంధిత శాఖలకు తెలియజేయకుండా, నిజమైన పరిస్థితులను పరిశీలించే విధంగా తనిఖీలు నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాంటి విధానంతోనే ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలు వెలుగులోకి వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.


