కడప (పున్నమి ప్రతినిధి), జులై 21: కడప నగరంలోని 48వ డివిజన్ పరిధిలోని బుడగజంగం కాలనీ, కృపా కాలనీలలో జనజీవనం తీవ్ర దుర్భరంగా మారింది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో స్థానికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా చాలు, కాలనీలోని వీధులన్నీ బురదమయంగా మారి మురుగు నీటితో నిండిపోతున్నాయి. సరైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు మరియు ఇంటి మురుగు నీరు రోడ్లపైనే నిలిచిపోయి కాలనీలన్నీ చిన్నపాటి మురుగు కుంటలను తలపిస్తున్నాయి. వీధుల్లో మురుగు నీరు నిలవడంతో బడికి వెళ్లే చిన్నపిల్లలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి పొడవునా పరుచుకున్న మురుగు నీటిలోనే ప్రతినిత్యం ప్రయాణించాల్సి వస్తోందని, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాలనీలోని ఖాళీ స్థలాలు కూడా మురుగు నీరు, చెత్తాచెదారంతో నిండిపోయి మురికి కూపాలుగా మారి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి బుడగజంగం కాలనీ, కృపా కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించాలని, నిలిచిన మురుగు నీటిని తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే కాలనీవాసులందరం ఏకమై కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపడతామని అన్నారు.



