*💥రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..!*
జోగులాంబ గద్వాల్ (పున్నమి ప్రతినిధి )
తెలంగాణ హైదరాబాద్ మహానగరం లోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నగరంలో కొనసాగుతున్న వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని రేషన్ ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు._
_అలాగే రేషన్ పంపిణీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు లబ్ధిదారులు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీంతో వరుసగా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మూడు నెలల కోటాను తీసుకునే సౌలభ్యం కలగనుంది._
_ప్రత్యేకించి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గించడంతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులు తమ సమీపంలోని న్యాయ ధరల దుకాణాలను సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడంతో పాటు మూడు నెలల రేషన్ బియ్యాన్ని నిర్ణీత తేదీల్లో తప్పకుండా పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


