అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై నజర్.. ఆత్మకూరులో పోలీసుల జల్లెడ!
ఆత్మకూరు: వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలో రద్దీ పెరగడంతో పాటు, రేపు జరగనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలు, డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచనల మేరకు ఆత్మకూరు సీఐ గంగాధర్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ డిపోలోని కార్గో కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పార్సిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు, వాటిలో ఏమున్నాయనే వివరాలను ఆరా తీశారు. అనుమానాస్పద పార్సిళ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్రం సెంటర్, ఆర్టీసీ డిపో, మున్సిపల్ బస్టాండ్, నెల్లూరుపాలెం తదితర రద్దీ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.


