సీఎస్ఐ కాంపౌండ్‌లో అక్రమ కట్టడాలపై వివాదం
కడప, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): కడప నగరంలోని సీఎస్ఐ కాంపౌండ్‌లో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన మున్సిపల్ అడిషనల్ కమిషనర్‌కు సీఎస్ఐ సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదురైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ కట్టడాలను పరిశీలించేందుకు అధికారులు కాంపౌండ్‌కు వెళ్లగా, ప్రధాన గేట్లకు తాళాలు వేసి అధికారులను లోపలికి అనుమతించలేదని సమాచారం. అడిషనల్ కమిషనర్ స్వయంగా తాళాలు తీయాలని సూచించినప్పటికీ సీఎస్ఐ సిబ్బంది స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మున్సిపల్ అధికారికే కనీస మర్యాద ఇవ్వలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, మున్సిపల్ కమిషనర్ రాకేష్‌కు గేట్ల తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లే అధికారాలు ఉన్నప్పటికీ, తాను ఒక ప్రభుత్వ అధికారిగా వ్యవహరించాల్సిన విధానాన్ని పాటించి బలవంతంగా గేట్లు తెరవలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార బలంతో వ్యవహరించకుండా, నిబంధనల ప్రకారమే సమస్యను పరిష్కరించేందుకు కమిషనర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, సీఎస్ఐ కాంపౌండ్‌లోని నిర్మాణాలపై హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలను సైతం లెక్కచేయకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధికారులను సైతం కాంపౌండ్‌లోకి అనుమతించకుండా గేటు వద్దే నిలిపివేయడం పట్ల జిల్లా కలెక్టర్ స్పందించాలని పలువురు కోరుతున్నారు. సీఎస్ఐ కాంపౌండ్‌లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల వెనుక ఎవరున్నారు? అధికారులను సైతం అడ్డుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.


