రంగంపేట, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం సింగంపల్లిలో రూ.2.20 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్యరంగంలో గణనీయమైన సంస్కరణలు చేపట్టి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే 65 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీంతో సామాన్యులు ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేస్తున్నామని తెలిపారు. అనపర్తి వంద పడకల ఆసుపత్రి, పెదపూడి సీహెచ్‌సీతో పాటు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలను బలోపేతం చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద రోగులకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, కాకినాడ, రాజమహేంద్రవరం జీజీహెచ్‌లను కూడా బలోపేతం చేసి అధునాతన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారుల రంగాల్లో సంస్కరణలు చేపట్టి సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, రంగంపేట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సింగంపల్లి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



