పున్నమి: రంగారెడ్డి జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటితంగా, ఐక్యంగా ఉద్యమించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం వనస్థలిపురంలోని ఒక ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో సర్పంచులు ప్రజల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఉపసర్పంచులకు ఇచ్చిన చెక్ పవర్‌ను తక్షణమే రద్దు చేయాలని, సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని, పంచాయతీ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. కరువు సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, గ్రామాభివృద్ధి నిధుల వినియోగానికి సర్పంచులకు ప్రత్యేక అకౌంట్ వెసులుబాటు కల్పించాలన్నారు. మహిళా సర్పంచులపై దాడులు జరగడం విచారకరమని, ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జక్క రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు భీమిడి ప్రదీప్, పెంటాగౌడ్, నర్సింహులు, జనరల్ సెక్రెటరీ కరణం కీర్తి రామకృష్ణ, మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చేవెళ్ల రేఖ తదితరులు పాల్గొన్నారు.





