దొరవారిసత్రం, ఆగస్టు 28:*
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారిసత్రం మండల పరిధిలోని మహెర్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో రాఖీ పౌర్ణమి వేడుకలు గురువారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.
కుటుంబానికి, సమాజానికి దూరమై ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులు, వృద్ధులు ఈ వేడుకలో ఒకరికొకరు రాఖీలు కట్టుకుని అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు. “మాకు అందరూ ఉన్నారు, మేమంతా ఒకే కుటుంబం” అంటూ వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది.
ఈ కార్యక్రమానికి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న ఇంచార్జీ బ్రో నీ గారు, ఆఫీసు అసిస్టెంట్ భవిత గారు,మెయింటెన్స్ ,చంద్ర గారు,మెడికల్ డిపార్ట్మెంట్ రాజేశ్వరి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ఆశ్రమ వాసులకు స్వయంగా రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ…
“మెహర్ ఆశ్రమంలో ప్రతి పండుగను కుటుంబ వాతావరణంలో జరుపుకోవడం మా ఆనవాయితీ. రోడ్లపై అనాథలుగా తిరుగుతున్న వారిని తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నాము. వారికి కుటుంబం లేదన్న లోటు తెలియకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నాము. రాఖీ అనేది కేవలం దారం కాదు, అది రక్షణకు, ప్రేమకు, భరోసాకు ప్రతీక” అని అన్నారు.
ఈ వేడుకల్లో దాదాపు 40 మందికి పైగా ఆశ్రమ వాసులు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. చివరిలో అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు.


