ఎర్రుపాలెం / ఖమ్మం
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలపురం గ్రామంలోని SJKRM జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో బాలాజీ భవన్ ఫంక్షన్ హాల్‌లో స్టూడెంట్ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు (డాక్టర్ జి.వి.) హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
నూతనంగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ జి.వి., విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలగుతూ కష్టపడి చదివి, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. విద్యతో పాటు మంచి విలువలు, సేవా భావం, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో SJKRM కాలేజ్ ఫౌండర్ గంధం సత్యనారాయణ, ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య, మేనేజ్మెంట్ మిరియాల శ్యాం ప్రసాద్, గజ్జల శ్రీనివాస్, గంజర్ల శ్రీకాంత్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. “నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. విద్యతో ఎదిగి.. విలువలతో నిలిచి.. సమాజానికి సేవ చేయాలి” అని వక్తలు ఆకాంక్షించారు.



