రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాకు చెందిన బీసీ నాయకురాలు దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల నెల్లూరు జిల్లా బీసీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవి అంగన్వాడీ విభాగానికి అధ్యక్షురాలిగా సేవలు అందిస్తూ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకురాలిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న సముచిత నిర్ణయం అని నెల్లూరు జిల్లా బీసీ నాయకులు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పెద్దల సభగా పిలవబడే శాసనమండలిలో రమాదేవి అడుగుపెట్టి, బీసీల హక్కుల గళాన్ని బలంగా వినిపించాలని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీసీల అభిమానాన్ని చూరగొనాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
రమాదేవిని అభినందిస్తూ ప్రకటనలు పంపిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్, జాతీయ కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి, జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస యాదవ్, రాష్ట్ర నాయకులు ఒట్టూరు సంపత్ రాజు, జాతీయ మీడియా కార్యదర్శి ఉక్కా వెంకట శేషయ్య, రాష్ట్ర నాయకురాళ్లు పిట్టి భార్గవి, లక్ష్మి, వసంతి, రాష్ట్ర నాయకులు ముత్యం గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు ఉన్నారు.


