పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
యలమంచిలి: ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులో దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలమంచిలికి చెందిన కర్రీ వరప్రకాశరావు ఈ నెల 16న వ్యాపార పనిమీద రాజమండ్రి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 20న మిస్సింగ్ కేసు నమోదైంది.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. డబ్బు మార్పిడి వ్యవహారంలో జరిగిన చీటింగ్‌కు సంబంధించి నలుగురి మధ్య తలెత్తిన వివాదంలో వరప్రకాశరావు హత్యకు గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద గోదావరిలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో సమాచారం లభించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గోదావరిలో ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేసులో మరిన్ని కీలక అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహం లభించిన అనంతరం పూర్తి వాస్తవాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.


