ఖమ్మం, జూలై 21
(పున్నమి ప్రతినిధి):
పెండింగ్లో ఉన్న రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ & బీజీఎన్ఆర్ కళాశాల ఎదుట మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. నిధులు అందక అనేక కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు నీటి సమస్యపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “రక్తంతో తడుపుకోమని చెప్పడం రాష్ట్రానికే సిగ్గుచేటు” అని విమర్శించారు. “మా రక్తం తీసుకోనైనా మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి” అంటూ ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ గర్ల్స్ కన్వీనర్ గీతాంజలి, నగర సంయుక్త కార్యదర్శి దీపక్ శర్మ, సిద్దు, మహేష్, అభినవ్, యశ్వంత్, మనోజ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.



