విశాఖపట్నం మారికవలసలోని ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులను ఇతర ప్రాంతానికి తరలించే చర్యలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మా తనూజరాణి ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన వసతులు, ఉన్నత విద్యా ప్రమాణాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాసంస్థలను తరలించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. పాఠశాల తరలింపు నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ఎంపీ డా. గుమ్మా తనూజరాణి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కులను దృష్టిలో ఉంచుకుని మారికవలస గురుకుల పాఠశాల తరలింపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో గురుకుల విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో తమ చదువును కొనసాగించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


