రామచంద్రపురం ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి
రామచంద్రాపురం మండలంలో దొంగల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మరువకముందే తాజాగా మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లడంతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు.
మండలంలోని సీకేపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల కావమ్మ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుంచి ఆమెను అనుసరించారు. అదును చూసి ఒక్కసారిగా ఆమె మెడలోని సుమారు 48 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని స్కూటర్‌పై వేగంగా పరారయ్యారు. ఊహించని ఘటనతో బాధితురాలు భయాందోళనకు గురయ్యారు.
చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు గ్రామంలోకి వెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే మండలంలో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మూడు రోజుల క్రితం పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరగగా.. తాజాగా మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ కావడం కలకలం రేపింది. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పట్టపగలే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో మహిళలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

