ముథోల్, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి ):ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా భూముల సమగ్ర సర్వే నిర్వహణకు ముథోల్ మండలంలోని జలాల్పూర్, గూడూరు, గోవిందాపూర్, చందాపూర్ గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ సర్వేకు సంబంధించి ఆయా గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కరేగాం, ఎడ్బిడ్, వెంకటాపూర్ గ్రామాల్లో సోమవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు భూభారతి సర్వే ప్రక్రియ, భూముల వివరాల నమోదు, సర్వే సమయంలో రైతులు తీసుకురావాల్సిన పత్రాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. భూములకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడంతో భవిష్యత్తులో భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రామ సభల్లో ముథోల్ తహసీల్దార్ శ్రీలత, డిప్యూటీ సర్వేయర్ గంగా నర్సయ్య, కరేగాం సర్పంచ్ మైత్రి నారాయణ, ఎడ్బిడ్ సర్పంచ్ రామచందర్ రెడ్డి, వెంకటాపూర్ సర్పంచ్ శ్రావణి గంగాశేఖర్, గిర్దావర్ నారాయణరావు పాటిల్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


