ప్రకృతిని ప్రేమిద్దాం.. పల్లగుట్టను కాపాడుదాం
గూడూరు పల్లగుట్ట మైనింగ్‌ను ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలి
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి): ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామ సరిహద్దులోని పల్లగుట్టపై జరుగుతున్న మైనింగ్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పల్లగుట్ట అనేక జీవరాశులకు ఆవాసంగా ఉండటంతో పాటు వర్షపు నీటిని ఒడిసి పట్టి గ్రామానికి సాగు, తాగునీటిని అందిస్తున్న సహజ వనరుగా ఉందన్నారు. గుట్టపై దర్గా, ముస్లింల సమాధులు ఉండటంతో పవిత్ర స్థలంగా భావిస్తున్నామని తెలిపారు. మాజీ సర్పంచ్ చాకలి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోజి రెడ్డి, దళిత్ లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గీస బిక్షపతి, CPI మాజీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, AISF జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి స్పందించి మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘం అధ్యక్షుడు చెరుకు ఎల్లం, యూత్ అధ్యక్షుడు కాసులవాడ శ్రీకాంత్, గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని సంతోష్, కే.రాజు, షేక్ అబ్బాస్‌తో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



