* మార్కుల విషయంలో ఐనవారికి ఆకులు – కానివారికి కంచాలు అంటున్న విద్యార్థినీలు
* టీటీడీ పెద్దలు జోక్యం చేసుకోవాలి: విద్యార్థుల తల్లిదండ్రులు
తిరుపతి (ఎస్వీయూ) సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇతర కేంద్ర విద్యా పరిపాలన సంస్థలు విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) నీ కల్పించడానికి ప్రధాన కారణం అనుబంధ విశ్వవిద్యాలయం నుండి ఆమోదం కోసం వేచి ఉండకుండా, తన సొంత పాఠ్యప్రణాళికను రూపొందించుకోవడానికి, స్వతంత్రంగా పరీక్షలు నిర్వహించడానికి, కోర్సులలో సిలబస్ ల నవీకరించడానికి విద్యాపరమైన స్వేచ్ఛనూ కల్పించి విద్యార్థులకు సకాలంలో ఫలితాల విడుదలకు, ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించి ఇచ్చిన అధికారం. అయితే ఈ అధికారంలో ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలో తీవ్ర అవినీతి చోటు చేసుకున్నాయి. మార్కుల విషయంలో డబ్బులు చేతులు మారుతోందని కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
*దుర్వినియోగమైవుతున్న అటానమస్*
టిటిడి విద్యాసంస్థలలో ఎంతో చరిత్ర కలిగిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, ఎస్జీస్ కాలేజీ లకు ఎస్వీయూ, రాష్ట్ర ప్రభుత్వం, యుజిసి లు సంయుక్తంగా స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అయితే ఇందులో ఉన్న అవకాశాన్ని కొంతమంది అవకాశవాదులు అందిపుచ్చుకొని ఆర్థికంగా పరిపుష్టి అవుతున్నారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో పూర్తిచేతి వాటం చూపిస్తున్నారు. ఐనవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్లు మార్కులు వేస్తున్నారు. బాగా చదివే విద్యార్థునీలుగా పేరు ఉన్నవారికి ప్రధాన పరీక్షలలో అతి తక్కువ మార్కులు రావడంతో వ్యవహారం బయటికి పొక్కింది. రీ – ఎవల్యూషన్ చేయించిన కూడా అవే మార్కులు రావడం తో విద్యార్థిని విద్యార్థులకు ఇందులో జరిగే అవకతవకలు పై అనుమానం కలిగింది. ముఖ్యంగా ఆయా కళాశాలల పరీక్షల నియంత్రణ అధికారి, ఉప నియంత్రణ అధికారి పాత్రలు చాలా కీలకం, వీరే చేతివాటం చూపిస్తున్నారు. డబ్బు ముట్ట చెప్పిన వారికి అధికంగా మార్కులు లభిస్తున్నాయి. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలనీ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే భవిష్యత్తులో ఉద్యమ బాట పడతామని వారు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని గమనించి టీటీడీ పెద్దలు, ఉన్నతాధికారులు, వర్సిటీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, తప్పు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.


