గాంధీ భవన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, వారి ఆశయాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ విభాగం కన్వీనర్ డా. కేతూరి వెంకటేష్ తో పాటు ఓబీసీ విభాగానికి చెందిన పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దేశభక్తి నినాదాలతో గాంధీ భవన్ ప్రాంగణం మార్మోగింది. నాయకులు, కార్యకర్తలు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ స్టేట్ కో-ఆర్డినేటర్ (ఓబీసీ విభాగం) వరికుప్పల సుధాకర్ మాట్లాడుతూ గాంధీ భవన్‌లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు
వరికుప్పల సుధాకర్
టీపీసీసీ స్టేట్ కో-ఆర్డినేటర్ – ఓబీసీ విభాగం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం





