పున్నమి న్యూస్ ప్రతినిధి
వేముల, ఆగస్టు 12: వేముల మండలంలోని గొందిపల్లి, రంగోరిపల్లి గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గొందిపల్లి గ్రామ పరిధిలో సాగు చేస్తున్న పత్తి పంట పొలాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేష్ మాట్లాడుతూ పత్తి పంటలో సస్యరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. చీడపీడల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుత ఎల్‌నినో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.
అలాగే శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వినియోగించాలని, అధికంగా ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.




