కొండాపురం మండలం, సాయిపేట పంచాయతీ పరిధిలోని ఇస్కపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”ఇంటింటికి తెలుగుదేశం”* కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు రూ.3 కోట్ల 85 లక్షల వ్యయంతో నిర్మించనున్న సాయిపేట నుండి కొమ్ముపాలెం గ్రామం వరకు తారురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇస్కపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి (వాటర్) ప్లాంటును ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగానే ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తదుపరి “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి , జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ శాఖ కమిటి నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధికి తీసుకున్న చర్యలను ప్రజలకు వివరంగా తెలియజేశారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలపై రూపొందించిన సమాచార పత్రాలను ప్రజలకు అందజేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అలాగే ఎనిమిది మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఇదే ఉత్సాహంతో నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, యువత, గ్రామ పెద్దలు, అభిమానులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


